COVID Third Wave: కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో 10రెట్లు పెరిగి పంజా విసురుతోంది. ఈ రోజు వచ్చిన కేసులను చూస్తుంటే.. దేశంలో మూడో వేవ్ తప్పేలా లేదని సంకేతంలా ఉంది. ఈ రోజు ఏకంగా 90వేల పైచిలుకు కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది నిన్నటి కంటే 56 శాతం అధికం. దీంతో దేశంలో కరోనా థర్డ్ వేవ్‌కు ఇది సంకేతమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 490గా నిర్ధారణ అయింది. దీంతో ఈ రకం కేసులు 2,630కి చేరాయి. ఈ మేరకు గణాంకాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో 14లక్షల13వేల30 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా, అందులో 90,928మందికి వైరస్ సోకింది. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గతంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం సమయం జూన్ నెలలో నమోదు అయ్యాయి. మళ్లీ భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతానికి పెరిగింది. మహారాష్ట్రలో 26 వేలు, పశ్చిమ్ బెంగాల్‌లో 14 వేలు, దిల్లీలో 10 వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.51 కోట్లకు పెరిగాయి.
Also Read: టీకా తీసుకున్న వారికీ కొవిడ్ పాజిటివ్.. ఎందుకిలా జరుగుతోంది..?
ప్రధానంగా మెట్రో నగరాల్లో అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అందుకు తాజా వేరియంట్ ఒమిక్రాన్‌నే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ దాదాపు దేశమంతా వ్యాప్తి చెందింది. మహారాష్ట్రలో అత్యధికంగా 797 మందికి సోకింది. తరువాతి స్థానంలో ఢిల్లీ నిలిచింది. అక్కడ 465 మంది వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది.
క్రియాశీల రేటు 0.81 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 19,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 3.43 కోట్లకు చేరాయి. అలాగే గత 24 గంటల వ్యవధిలో 325 మంది మృతి చెందడంతో ఈ సంఖ్య 4,82,876కు చేరింది. అయితే ఇలా గణనీయంగా కేసులు పెరగడం మాత్రం థర్డ్ వేవ్‌కు కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు.