దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఎంతగా పెరుగుతున్నాయంటే.. ప్రపంచంలోనే కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న అమెరికాలో కంటే భారత్ లోనే ఈ రేటు అధికంగా ఉంది. ఈ పెరుగుదలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో సంక్రమణ రేటు అమెరికా మరియు బ్రెజిల్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఈ రేటు అమెరికాలో 1.8, బ్రెజిల్ లో 1.9 శాతం ఉండగా భారత్ లో ఈ రేటు 3.3 శాతం ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం. అయితే ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటు దక్షిణాఫ్రికాలో 4.7 శాతంగా ఉంది. అత్యధిక రోజువారీ సగటు రోగులు యుఎస్, బ్రెజిల్ లో 30వేలు దాటగా.. భారతదేశంలో 25వేలు దాటాయి. అదే సమయంలో, రోజువారీ మరణాలలో బ్రెజిల్ ముందంజలో ఉంది. బ్రెజిల్ లో సగటున 825 మంది, అమెరికాలో 601, భారతదేశంలో 549 మంది మరణిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా యొక్క పరీక్ష పాజిటివిటీ రేటు సుమారు 9.34 శాతం. 21 వ రోజు రోగుల సంఖ్య రెట్టింపు అవుతోంది. గత 20 రోజుల్లో, రాజధాని .ఢిల్లీలో రోజువారీ కేసుల వేగంలో కాస్త తగ్గుదల ఉందని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం భారత్ లో కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916కు చేరుకుంది. గత 24 గంటల్లో 27,114 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే అదే స్థాయిలో కోలుకొని ఇంటికి వెళ్తున్నవారి సంఖ్యా పెరగడం శుభ పరిణామం. అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ అత్యంత ప్రమాదకరంగా ఉంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33 లక్షలకు చేరువైంది. గత మూడు రోజుల నుంచి రోజుకు 60 వేల కొత్త కేసులు బయటపడగా.. నిన్న ఒక్క రోజే 72 వేల కేసులు నమోదయ్యయి.