తెలంగాణలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో కూరగాయలు ధరలు భగ్గుమంటున్నాయి. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూతో కారోనాని నియంత్రించడానికి ఈ నెల 31వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో నిత్యావసరాల కోసం జనాలు పెద్దసంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. జనాల రాకతో రైతు బజార్లు, పండ్ల మార్కెట్లు, పెట్రోల్ బంకులు రద్దీగా మారాయి. ప్రైవేటు వాహనాలు, వ్యక్తిగత వాహనాల రాకపోకలతో ప్రధాన రహదారులపై రద్దీ పెరిగింది.
మరోవైపు రద్దీ పెరగడంతో రైతుబజార్లలో అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తున్నారు. రైతుబజార్లకు సమీప ప్రాంతాల నుంచి కూరగాయల రాక తగ్గిందని చెబుతున్నారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ధరలు పెంచి అమ్మడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు షాపింగ్ మాల్స్ వద్ద ఉదయం 9గంటల నుంచే నగరవాసులు బారులు తీరారు. కరోనా నేపథ్యంలో వినియోగదారులను పరీక్షించిన అనంతరమే లోనికి అనుమతిస్తున్నారు. ఒక్కో వినియోగదారుడి మధ్య కనీస దూరం ఉండేట్లు చూస్తున్నారు.