
చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలయ్యాయి. చైనా మినహా అన్నిదేశాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా మరణాలు కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. అమెరికా, ఇటలీ, బ్రిటన్, యూకే లాంటి అగ్రదేశాలు సైతం ఈ వైరస్ దాటికి కకావికలమయ్యాయి. ఈ దేశాల్లో కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కొన్ని దేశాలు లాక్డౌన్ వంటి కఠిన చర్యలతో కొంతమేర కట్టడి చేయగలిగారు.
జనాభా అధికంగా ఉన్న చైనా, భారత్ దేశాలు లాక్డౌన్ చర్యలు చేపట్టి కొంతమేర వైరస్ విజృంభణను కొంతమేర కట్టడి చేశాయి. అయితే ఇది తాత్కాలికమే. చైనా కఠిన చర్యలు అమలు చేయడంతో కొత్తగా కేసులు నమోదుకావడం లేదు. అక్కడక్కడ కేసులు నమోదవుతున్నా వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటుంది. ఇక భారత్ గత పదిరోజులుగా రోజుకు వేలల్లో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ తరుణంలోనే చైనాలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో అందరి దృష్టి అటువైపు పడింది.
కోవిడ్-19 వైరస్ కు వ్యాక్సిన్ కనుగోనేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే వైరస్ రకరకలుగా రూపాంతరం చెందుతుండటంతో వ్యాక్సిన్ కనుగోనటం కష్టంగా మారింది. తాజాగా చైనాలోని ఔషధ తయారీ సంస్థ సినోవ్యాక్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలివడంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మానవులపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ టీకా మొదటి రెండు దశలు పూర్తి చేసుకుందని ఆ సంస్థ ప్రకటించిది. ‘కరోనా వ్యాక్స’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ టీకాను 18నుంచి 59ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 743మందిపై ప్రయోగించినట్లు వెల్లడించింది.
ఈ టీకా తీసుకున్న 14రోజుల తర్వాత 90శాతం మందిలో కరోనాతో పోరాడే యాంటీ బాడీలు తయారైనట్లు స్పష్టం చేసింది. టీకా తీసుకున్న వారిపై ఎలాంటి దుష్ఫలితాలు లేకపోవడంతో మూడో దశకు ట్రయల్స్ సిద్ధమవుతుంది. మూడోదశలో దేశం బయట ప్రయోగాలు చేయనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. వ్యాక్సిన్ తయారీకి బ్రెజిల్ లోని ఓ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న సినోవ్యాక్ బయోటెక్ వెల్లడించింది. మరోవైపు ప్రఖ్యాత ఫార్మాసూటికల్ కంపెనీలు సైతం కరోనాకు వ్యాక్సిన్ ను కనుగోనే పనిలో నిమగ్నమయ్యాయి. వీలైనంత త్వరగా కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు సైంటిస్టులు పోటాపోటీగా ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో త్వరలోనే వైరస్ కు వ్యాక్సిన్ రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.