బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది. గొప్ప ప్రతిభావంతుడైన నటుడు, ఎంతో భవిష్యత్ ఉన్న వ్యక్తి ఇలా అర్ధంతరంగా లోకాన్ని విడిచిపెట్టడం పలువురిని కలిచి వేసింది. సుశాంత్ ఆదివారం ముంబైలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వార్త షాక్‌కు గురి చేసిందని, సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలువురు క్రీడాకారులు ట్వీట్ చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఒత్తిడి, కుంగుబాటు కారణంగానే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. కానీ, ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే హఠాత్తుగా ఆత్మహత్యం చేసుకోవడం మిస్టరీగా మారింది. సుశాంత్ ఇంట్లో సూసైడ్ నోట్ లభించలేదు.
మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఒంటరితనం వల్లే యువ నటుడు ఆత్మహత్య చేసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ లోకాన్ని విడిచి పెట్టాలనుకునేంత ఒత్తిడి, కుంగుబాటుకు అతను ఎందుకు గురయ్యాడంటే ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. తల్లి మరణం, ఆరేళ్ల ప్రేమ విఫలం కావడం.. మరో అమ్మాయితో పెళ్లి చివరి నిమిషంలో వాయిదా పడడం వల్లే సుశాంత్ కుంగిపోయాడని తెలుస్తోంది.
అమ్మను మరిచిపోలేక
బీహార్ లోని పూర్నియా జిల్లాకు చెందిన సుశాంత్ కుటుంబం పాట్నాలో స్థిరపడింది. సుశాంత్ చిన్నతనంలోనే ఆ కుటుంబంలో ఓ విషాదం. తన 16వ ఏటనే తల్లి ఉషా సింగ్ మరణించడంతో అతను డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం ఢిల్లీకి మకాం మార్చింది. వాతావరణం మారడంతో చదువులో గొప్పగా రాణించాడు సుశాంత్. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో.. మెకానికల్ ఇంజనీరింగ్‌లో అడ్మిషన్ తెచ్చుకున్నాడు. ఫిజిక్స్‌లో నేషనల్ ఒలింపియాడ్ విన్నర్ కూడా అయిన సుశాంత్ తర్వాత థియేటర్ ఆర్ట్స్ వైపు ఆకర్షితుడవడంతో చదువు మధ్యలోనే ఆపేశాడు. ఆపై నటక రంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి తన టాలెంట్‌తో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ, ఎంత స్టార్డమ్, డబ్బు సంపాదించినా అతని ఆలోచనలు ఈ లోకంలో తల్లిచుట్టూనే తిరిగేవి. ఆమెను తలుచుకుంటూ కవితలు రాసేవాడు. ‘అమ్మా.. నీకు గుర్తుందా. ఎప్పటికీ నాతో కలిసుంటానని మాటిచ్చావు. నువ్వు లేకపోయినా సంతోషంగా నవ్వుతూ ఉంటానని నేను కూడా నీకు మాటిచ్చా. కానీ ఇప్పుడనిపిస్తోంది.. ఇద్దరమూ తప్పేనని’ ఓ సందర్భంలో రాశాడు. కొన్ని రోజుల కిందట తల్లిని మరోసారి గుర్తు చేసుకున్నాడు. ‘మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా’ అని ఈ నెల 3వ తేదీన ఓ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.
ఆరేళ్ల ప్రేమ ముగియడం తట్టుకోలేక
సినిమాల్లోకి రాకముందు పలు టీవీ సీరియల్స్‌లో సుశాంత్ నటించాడు.ఈ క్రమంలో సహనటి అంకితా లోఖాండేతో ప్రేమో పడ్డాడు. దాదాపు ఆరేళ్ల పాటు వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. అంకిత తనపై చూపించే ప్రేమతో తల్లి మరణం నుంచి క్రమంగా కోలుకున్నాడు. వీరిద్దరి పెళ్లి ఖాయం అని చాలా మంది భావించారు. కానీ, ఏమైందో ఏమో కానీ సడెన్‌గా విడిపోయారు. దాంతో, సుశాంత్ మళ్లీ డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అతడిని మళ్లీ ఒంటరితనం ఆవహించింది. మరోవైపు ఈ బ్రేకప్ నుంచి అంకితా లోఖండే త్వరగానే బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వికీ జైన్ అనే వ్యక్తితో రిలేషన్‌షిప్ ఏర్పరుచుకున్న ఆమె ఈ నెల 11వ తేదీనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన చేయకపోయినా వేలికి ఉంగరంతో కూడిన ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
పెళ్లి ఆగిపోవడంతో కుంగిపోయి..
అంకితతో బ్రేకప్ అయిన తర్వాత సుశాంత్ నాలుగేళ్ల పాటు ఒంటరిగానే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ బయోపిక్‌తో స్టార్డమ్ తెచ్చుకోవడంతో పాటు వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు. నెమ్మదిగా అంకితను మర్చిపోయిన తను మరో నటికి దగ్గరయ్యాడు. ఆ నటి పేరు రియా చక్రవర్తి. తమ బంధాన్ని బహిరంగ పరచకపోయినా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. గతేడాది నవంబర్లోనే సుశాంత్ పెళ్లి జరగాల్సి ఉందని అతని కజిన్ ఒకరు చెప్పాడు. పెళ్లి వేడుక కోసం కుటుంబ సభ్యులంతా ముంబై వచ్చేందుకు రెడీ అయ్యారట. ఇంతలో పెళ్లి ఆగిపోయిందన్న సమాచారం వచ్చిందని తెలిపాడు. ఇలా వరుస షాక్‌లతో సుశాంత్ మరింత కుంగిపోయాడు. అప్పటి నుంచి ఆరు నెలల పాటు అతను ఎవ్వరినీ కలవకుండా బాంద్రాలోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు.
అదే సమయంలో అతని చేతుల్లోకి వచ్చిన కొన్ని సినిమా ఆఫర్లు కూడా దూరమయ్యాయి. బాలీవుడ్‌లో కొందరు తనను కావాలనే దూరం పెడుతున్నారని, కొన్ని వేడుకలకు తనను అస్సలు ఆహ్వానించరని ఓ సందర్భంలో సుశాంత్ చెప్పాడు. ఇక, తన దగ్గర మేనేజర్ గా పని చేసిన దిశ అనే యువతి వారం కిందటే ఆత్మహత్య చేసుకోవడం కూడా సుశాంత్‌ను తీవ్రంగా కలవరపాటుకు గురి చేసింది. తల్లి జ్ఞాపకాలు వెంటాడడం, ప్రేమ, పెళ్లి విఫలం.. అవకాశాలు చేజారడం… తన దగ్గర పనిచేసిన వ్యక్తి మరణం.. ఇలా అనేక విషాదాలు, అవరోధాలను తట్టుకోలేకపోయిన సుశాంత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లాలనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు.. చనిపోయే ముందే తన అప్పులన్నీ తీర్చేసిన యువ నటుడు ఎవ్వరికీ బాకీ ఉండకూడదని అనుకున్నాడు. కానీ, చావే అన్నింటికీ పరిష్కారం కాదని నిజాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు.