Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. మనుషుల జీవితాలపై పెను ప్రభావం చూపింది. ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసింది. ఆర్థికంగా, సామాజికంగా కోట్లాది జీవితాలపై చెరగని ముద్ర వేసింది. అందరి జీవితాల్లో వెలుగులు లేకుండా చేసింది. భారతీయుల ఆయుర్దాయాన్ని రెండేళ్లు తగ్గించింది. దీనిపై పలు సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. దేశంలో నానాటికి దిగజారిపోతున్న పరిస్థితులపై ప్రత్యేకంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ (ఐఐపీఎస్) నిర్వహించిన ఓ అధ్యయనంలో పలు విషయాలు వెలుగు చూశాయి. ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ నేతృత్వంలో జరిగిన సర్వేలో కరోనా కారణంగా భారతీయుల ఆయుష్షు రెండేళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. అసలే రసాయన మందుల ప్రభావంతో క్షీణిస్తున్న ఆరోగ్యాలతో కరోనా కూడా తోడవడంతో మనుషుల్లో ఆయుష్షు క్రమంగా క్షీణిస్తున్నట్లు చెబుతున్నారు.
2019లో పురుషుల ఆయుర్దాయం 69.5 ఏళ్లుండగా 2020 నాటికి అది 67.5 ఏళ్లకు పడిపోయిందని తెలుస్తోంది. ఇక మహిళల ఆయుర్దాయం కూడా 72 ఏళ్లు ఉండగా అది కూడా 69.8 ఏళ్లకు తగ్గిపోయినట్లు సమాచారం. దీంతో మనుషుల ఆయుష్షు క్రమంగా కిందకు దిగజారడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో అది మరింత తగ్గి మనుషుల ఆయుష్షుకు నిర్దిష్ట ప్రమాణం ఉండదనే విషయం తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావంతోనే మనుషుల జనన, మరణాలపై అధ్యయనం కొనసాగుతోంది. గత ఏడాది ప్రాణాలు కోల్పోయిన లక్షల మంది జీవితంపై పరిశోధనలు చేస్తున్నారు. 35-69 మధ్య వయస్కులైన పురుషులే ఎక్కువగా మరణించినట్లు చెబుతున్నారు. దీంతో కరోనా వైరస్ ప్రభావంతోనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తితోనే పలువురు తమ ప్రాణాలు కోల్పోయినట్లు సర్వే వెల్లడించింది.