Kapu Votes : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఏపీలో రాజకీయాలు మరింత రంజుగా మారాయి.. ఈ భేటీని చారిత్రాత్మక సమావేశంగా పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ అభివర్ణిస్తున్నాయి. ఇదే సమయంలో అక్కడ అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ నాయకులు వేరే విధంగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరోసారి తెలుగుదేశం పార్టీ ప్యాకేజీకి అమ్ముడుపోయారని ధ్వజమెతుతున్నారు. ఈ విషయం ఇలా సాగుతుండగానే… మధ్యలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూరారు.. సోషల్ మీడియాలో తనదైన శైలిలో పోస్టులు పెడుతున్నారు. కాపు ఓటర్ల ఆత్మగౌరవాన్ని మరోసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద తాకట్టు పెట్టారని ఆరోపిస్తున్నారు.. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మీద అలాగైతే వ్యంగ్యంగా పోస్టులు పెట్టారో… ఇప్పుడు కూడా అదే ఒరవడి సృష్టిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను సీనియర్ నటుడు నాగబాబు ఖండిస్తున్నారు.. ప్యాకేజీలకు అమ్ముడు పోవాల్సిన ఖర్మ పవన్ కల్యాణ్ కు పట్ట లేదని ఆయన ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తే… కోట్లకు కోట్లు పారితోషికం వస్తుందని ఆయన చురకలాంటించారు.

-నానా యాగి చేస్తున్నారు
ఇక పవన్, బాబు భేటీ పై వైసీపీ నాయకులు నానా యాగి చేస్తున్నారు.. ప్రజల సమస్యలు వదిలిపెట్టి అధికార పార్టీ నాయకులు కేవలం దీని మీదే దృష్టి పెట్టారు.. ఏపీలో ఎన్నికలకు ముందే కులాల కుంపటి రగిలించే పనిలో పడ్డారు. ఇక అధికార పార్టీ సొంత మీడియా అయితే విలువలు లేకుండా వార్తలు రాస్తున్నది.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ ను తీసేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబు మాట్లాడిన మాటలు కొంతమేర ఆసక్తి కలిగిస్తున్నాయి.. తాము కాపు సామాజిక వర్గానికి చెందిన వారమని, కానీ ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను ఒకరి కాళ్ళ కింద తాకట్టు పెట్టాల్సిన ఖర్మ మాకు లేదని ఆయన స్పష్టం చేయడం గమనార్హం..
-తెర పైకి పెయిడ్ బ్యాచ్
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ జరిగిందో లేదో.. వైసీపీ పెయిడ్ బ్యాచ్ రంగంలోకి దిగింది. ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేస్తున్నాడు. కాపు సామాజిక వర్గ ఓట్లను చంద్రబాబు కాళ్ళ కింద తాకట్టు పెట్టాడని తలా తోకాలేని మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గానికి ఏం చేశాడో మాత్రం చెప్పడు. కులాలకు అతీతంగా కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ పరిహారం ఇస్తుంటే…దానిని మాత్రం రామ్ గోపాల్ వర్మ బయటకు ఏమాత్రం చెప్పడు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 2019 నాటి విషయాలే గుర్తుకు వస్తున్నాయి. కానీ అప్పుడు మోసపోయినట్టు మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఆ విషయం అర్థమైంది కనుకే పవన్ కళ్యాణ్ పై జగన్ విషం చిమ్ముతున్నాడు. అలాంటి విషాలు ఈ పది సంవత్సరాలలో పవన్ చాలానే చూశాడు.