Corruption In Aarogyasri: పేదల వైద్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కొందరికి కాసులు కురిపిస్తుందా? పథకం అవినీతిమయంగా మారిందా? నిధులు భారీగా పక్కదారి పట్టిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన తండ్రి మానసపుత్రికగా ఎప్పుడు చెప్పుకునే సీఎం జగన్ పథకాన్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పరిధిలో 2,290 వరకు నెట్‌వర్క్ ఆస్పత్రులున్నాయి. వీటిలో 874 వరకూ ప్రైవేటు ఆస్పత్రులే. ఏడాదికి ఒకసారి ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో ఒప్పందం చేసుకోవాలి. ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి ఈ ప్రక్రియ నడుస్తోంది. ఏడాదికి ఒకసారి ఎంవోయూ చేసుకుంటేనే ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలకు ట్రస్ట్ అనుమతిస్తుంది. అయితే.. ఈ ఏడాది ఎంవోయూ ప్రక్రియను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు అవినీతిమయం చేశారు. ఎంవోయూల పేరుతో ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ల అవినీతికి అంతు లేకుండాపోయింది. 100 పడకల ఆస్పత్రికి ఒక రేటు, 50 పడకల ఆస్పత్రికి ఒక రేటు, డెంటల్ ఆస్పత్రికి ఒక రేటు నిర్ణయించారు. ఎంవోయూ ప్రక్రియ సక్రమంగా పూర్తి కావాలంటే కో- ఆర్డినేటర్లు అడిగిన మొత్తాన్ని ఇవ్వాల్సిందేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేకుంటే రకరకాల కొర్రీలు పెడుతుంటారు.
ఆ నిబంధనతో పిండుడే..
ఆరోగ్యశ్రీ పథకంలో కీలకమైన నిబంధన కో-ఆర్డినేటర్లకు కాసుల వర్షం కురిపించింది. నిబంధనల ప్రకారం 100 పడకల ఆస్పత్రిలో 16 మంది డ్యూటీ డాక్టర్లు, 36 మంది నర్సులు విధులు నిర్వహించాలి. 50 పడకల ఆస్పత్రిలో 8 మంది డ్యూటీ డాక్టర్లు, 18 మంది నర్సులను నియమించాలి. వీరందరినీ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవల కోసం ఉపయోగించాలి. రాష్ట్రంలోని చాలా ఆస్పత్రుల్లో ఆ ప్రకారం డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు అందుబాటులో లేరు. సాధారణ రోజుల్లో జిల్లా కో-ఆర్డినేటర్లు చూసీచూడనట్లు వదిలేస్తారు. కానీ, ఎంవోయూ సమయంలో మాత్రం ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని కో-ఆర్డినేటర్లు భారీగా దండుకున్నారని నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు బహిరంగంగానే చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రధాన కార్యాలయానికి ఈ విషయంపై సృష్టమైన సమాచారం ఉంది. నాలుగు జిల్లాల కో-ఆర్డినేటర్లపై అనేక ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ ట్రస్ట్ అధికారులు చర్యలకు ఉపక్రమించడం లేదు. దీంతో కో-ఆర్డినేటర్ల అడగాలు మరింత పెరుగుతున్నాయి.
Also Read: Nagarjuna: నాగార్జున కి ఊహించని షాక్ ఇచ్చిన మాజీ కోడలు సమంత
ఇప్పటికీ వారే..
పునర్విభజనతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించింది. దీనికి అనుగుణంగా అన్ని విభాగాలూ వారి ఉద్యోగులను విఽభజించాలని, కొత్త జిల్లాలకు కొత్త ఉన్నతాధికారులను నియమించాలని సృష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాత్రం ఇప్పటి వరకు ఈ ప్రక్రియను ప్రారంభించలేదు. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలకు, పాత జిల్లాల కో-ఆర్డినేటర్లనే ఇన్‌చార్జులుగా నియమించింది. దీంతో కో-ఆర్డినేటర్లు పండగ చేసుకున్నారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్లుగా ప్రభుత్వ వైద్యులను నియమించడం పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకునే వైద్యులను కో-ఆర్డినేటర్లుగా నియమిస్తున్నారు. దీనివల్ల ఆశించిన స్థాయిలో పేద రోగులకు మేలు జరగడం లేదు.
ఏదో విధంగా వారు ప్రైవేటు ఆస్పత్రులకు అనుకూలంగా మారిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో కో-ఆర్డినేటర్లు, డీఎంహెచ్‌వోలు కుమ్మక్కై నెట్‌వర్క్ ఆస్పత్రులను పిండేస్తున్నారు. రాయలసీమలో ఈ తరహా వ్యవహారాలు ఎక్కువగా నడుస్తున్నాయని నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అయినా.. స్పందించేవారు కరువవడం గమనార్హం.
Also Read:AP Tenders: ఏపీ టెండర్లలో కొత్త రూల్.. పనులు చేయాలి కానీ డబ్బులడగొద్దు