చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తుంది. ఈ వైరస్ ప్రపంచలోని అన్ని దేశాలకు పాకింది. ఈ వైరస్ పేరుచెబితే దేశాలన్నీ వణికిపోతున్నాయి. పేద, ధనిక దేశాలు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కరోనా విజృంభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులను చూస్తే భయాందోళనలు నెలకొంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా కరోనా ధాటికి విలవిలలాడిపోతుంది. అందమైన ఇటలీ దేశం శవాలదిబ్బను తలపిస్తుంది. ఇక బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో రాజకుటుంబాలే కరోనా బారినపడ్డాయి. దీంతో కరోనా ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 12లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 12,01,964కాగా ఇందులో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 64,727కు చేరుకుంది. కరోనా నుంచి రికవరీ అయినవారి సంఖ్య 2,46,638. ప్రపంచవ్యాప్తంగా యాక్టీవ్ గా కరోనా కేసులు 8,90,599. ఇందులో మరో 40వేల మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. చైనా పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం అక్కడ తగ్గు ముఖంపడుతోంది. అయితే చైనేతర దేశాల్లో ఇది విలయతాండవం చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. భారత్ లోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,588కు చేరింది.