కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలన్నీ మూసివేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి సంచలన ప్రతిపాదన చేసినట్లు సమాచారం.
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా థియేటర్లు మళ్లీ మూసివేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది. ఈ పరిణామాం టాలీవుడ్ పై పిడుగు వేసినట్టు అయ్యింది.
వరుసగా కొత్త సినిమాలు విడుదల అవుతుండడంతో థియేటర్లు 90శాతంపైగా నిండిపోతున్నాయని.. ప్రేక్షకులు మాస్కులు ధరించకుండా పక్క పక్క సీట్లతో కూర్చోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోందని అధికారులు నివేదిక ఇచ్చారు. తలుపులన్నీ మూసివేసి ఏసీ వేయడం వల్ల కేసులు పెరుగుతున్నాయని రిపోర్ట్ ఇచ్చారు. దీంతో సినిమాహాళ్లు,జిమ్ లు, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు.
ఒకవేళ థియేటర్లు పూర్తిస్తాయిలో మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లు 50శాతం అక్యూపెన్సీతో నింపుకునేలా నిబంధనలు విధించాలని సూచించింది. ఈ పరిణామం కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. విడుదలకు సిద్ధమైన భారీ పెద్ద సినిమాల నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయి దాటిపోయే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యఆరోగ్యశాఖ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వైద్యఆరోగ్యశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం బుధవారం నుంచి విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసింది. ఇప్పుడు థియేటర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.