ఆంధ్రప్రదేశ్ లో ఆక్సీజన్, మందులు దొరక్క వందలాదిగా ప్రాణాలు పోతున్నాయని, ప్రభుత్వం మాత్రం తప్పుడు లెక్కలు చెబుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మరణాల సంఖ్యను సర్కారు ఉద్దేశపూర్వకంగానే దాస్తోందన్న పవన్.. మృతుల కుటుంబాల కన్నీళ్లను దాచగలరా? అని ప్రశ్నించారు.
విజయనగరం, విశాఖ వంటి ప్రాంతాల్లో బెడ్లు దొరక్క, ఆక్సీజన్ లేక కరోనా బాధితులు చనిపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇక, అత్యవసరమైన రెమ్ డెసివర్ ఇంజక్షన్ ను బ్లాక్ మార్కెట్లో రూ.40 వేలకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఇంత ధర పెట్టి సామాన్యులు తమ ప్రాణాలు నిలుపుకోగలరా? అని నిలదీశారు.
ఇక, రాష్ట్రంలో వేలాదిగా అంబులెన్సులు ఏర్పాటు చేశామని చెబుతున్న ప్రభుత్వం.. రోగులను మాత్రం ఆసుపత్రికి తరలించలేకపోతోందని అన్నారు. ఎన్ని ఫోన్లు చేసినా ఉపయోగం ఉండట్లేదని అన్నారు. రెమ్ డెసివర్ ఇంజక్షన్లు, ఆక్సీజన్ సరఫరా కోసం జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ.. వాళ్ల నుంచి ఎలాంటి స్పందనా లేదని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతీ 20 నిమిసాలకు ఒక ప్రాణం పోతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్న జనసేనాని.. క్షేత్రస్థాయిలో అంతకన్నా ఎక్కువే ఉందని చెప్పారు. శ్మశానంలో శవాల లెక్కలనే తప్పని చెబుతున్నారని మండిపడ్డారు. కరోనా మృతుల లెక్కలు దాచగలరేమోగానీ.. మృతుల కుటుంబాల కన్నీళ్లను దాచగలరా? అని నిలదీశారు.
వైద్యుల గురించి మాట్లాడుతూ.. కరోనా రోగులకు సేవలు అందించేందుకు ప్రమాదకర పరిస్థితుల్లో వైద్యులు పనిచేస్తున్నారని, వారందరినీ ప్రజలు అభినందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులకు మౌళిక సౌకర్యాలు అందుబాటులో లేవని, వైద్యశాఖ ఆ విషయంపై దృష్టిసారించాలని కోరారు.