
కరోనా కష్టకాలంలో ఎంతోమంది తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలున్నారు. రాజమండ్రిలో ఎన్నో కోట్లు ఉన్నా కూడా అమ్మనాన్న, నాన్నమ్మ-తాతయ్య అందరూ కరోనాకు బలి కావడంతో 11 ఏళ్ల బాలుడు ఒంటరిగా అనాథ అయిపోయిన దీనగాథ అందరినీ కంటతడి పెట్టించింది.
అలాంటి ఎన్నో సంఘటనలు మన కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. కరోనా వేళ ఎంతో మంది తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారు. వారిని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రెక్కలు ముక్కలు చేసుకొని బువ్వ పెట్టి ఆలనాపాలనా చూసే అమ్మను అనారోగ్యం మింగేసింది. నాన్న అప్పటికే ఈసంసారం సాగరంలో ఈదలేక ఎటో వెళ్లిపోయాడు. ఇప్పుడు అమ్మ కూడా మరణించడంతో ఆ విధి ఆ చిన్నారులపై పగబట్టి ఆడుకుంటోంది. అనాథలను చేసింది. ఇద్దరు పిల్లల భవిష్యత్ ను అంధకారం చేసింది. కన్నవాళ్లు లేకపోవడంతో ఇక తమను ఎవరు ఆదుకుంటారని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తమను ఎవరు చదివిస్తారు.. పెంచి పెద్ద చేస్తారని భవిష్యత్ పై బెంగతో రోదిస్తున్నారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్లీ గ్రామానికి చెందిన అర్జున్, సంగీతా భాయ్ దంపతులు సమాజసేవనే లక్ష్యంగా ముందుకు సాగారు.. ఆకలేసిన వారికి అన్నంపెడుతూ అనాథలను చేరదీస్తూ అసహయులకు అండగా నిలుస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరు సంతానం.. శృతి, దేవానంద్ పిల్లలతో కలిసి ఆదుకునేవారు.
మూడు సంవత్సరాల క్రితం అర్జున్ ఇల్లు వదిలేసి.. భార్య పిల్లలను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. ఇప్పటికీ అతడు ఎటు వెళ్లాడో తెలియడం లేదు. అయితే సంగీతాభాయ్ గత నెలలో అనారోగ్యంతో మృతి చెందింది. వారి ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలయ్యారు.
శృతి, దేవానంద్ పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా గ్రామస్థులు సంఘాలు కలిసి ఆదుకున్నాయి. ఖర్చులకు రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. ఇక వారి బాగోగులు చూసేందుకు.. వారిని ఆశ్రమంలో చేర్పించేందుకు చర్యలు చేపట్టారు.
అయితే గ్రామాల్లో ఇలా ఆదుకున్నారు. పట్టణాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన వారిని ఆదుకునే వారే లేరు. ఇలాంటి పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాల్సిన అవసరం ఉంది.