దేశంలో ఓ పక్క కరోనా కల్లోలం కొనసాగుతోంది. వేలు ఎప్పుడో దాటిపోయిన కేసులు.. లక్షల్లో నమోదవుతున్నాయి. అయినా.. జనాలు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇందులో రాజకీయ ప్రముఖులు కూడా చేరిపోవడం విస్మయ పరుస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కేవలం కేసీఆర్ మాత్రమే కాకుండా.. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ తోపాటు ఆయన కుటుంబం మొత్తం కొవిడ్ బాధితులుగా మారిపోయారు. వీరితోపాటు ఇంకా పలువురు నేతలు కరోనా కాటుకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి.
కేవలం గులాబీ నేతలు మాత్రమే కాకుండా.. ఇతర పార్టీలకు చెందిన వారికీ కరోనా సోకింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురికి పాజిటివ్ రిపోర్టు రావడంతో.. అందరూ ఐసోలేషన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే.. ముఖ్యమంత్రికి కరోనా ఎక్కడ వ్యాపించి ఉండొచ్చనే ప్రశ్నకు.. హాలియా సభలోనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేసీఆర్ తోపాటు నోముల భగత్, కడారి అంజయ్య, ఎంసీ కోటిరెడ్డి వంటి నేతలు ఒకేసారి కరోనా బారిన పడడంతో ఈ వాదనలకు బలం చేకూరుతోంది. ఈ బహిరంగ సభ వేదికపై.. సీఎంతోపాటు అభ్యర్థి భగత్, ఇంకా పలువురు నేతలు మాస్కు లేకుండానే చాలా సేపు ఉన్నారు.
ఈ సమయంలో వైరస్ వ్యాపించినట్టు అంచనా వేస్తున్నారు. ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్న నేతలు.. వార మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జనం మండిపడుతున్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, కుంభమేళా వంటి కార్యక్రమాల ద్వారానే వైరస్ వేగంగా విస్తరిస్తోందని, ముందు వాటిని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.