Corona : గతంలో కరోనా సృష్టించిన అల్లకల్లోలం మామూలుగా లేదు. రాకపోకలు బంద్, ప్రత్యక్షంగా ఇతరులతో మాట్లాడటం బంద్, ఉద్యోగాలు బంద్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడిక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఇలా ఈ కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన వినాశనం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. అప్పటి నుంచి ఈ వైరస్ గురించి ప్రజలలో భయాందోళన వాతావరణం ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం మరోసారి, కరోనా వైరస్ JN1, కొత్త వేరియంట్ భారతదేశంలో ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు, బెంగళూరు నుంచి ఒక విచారకరమైన వార్త వచ్చింది. అక్కడ కరోనా కారణంగా ఒక అమ్మాయి మరణించిందట. దీంతో మళ్లీ ప్రజలు భయపడుతున్నారు. కానీ ఈ భయం మధ్య, ఐఐటీ కాన్పూర్ ఓ ఉపశమనకరమైన వార్తను తెలియజేసింది. ఇది ప్రజల ఆందోళనలను కొంచెం తగ్గించింది అనే చెప్పవచ్చు.
దేశ జనాభా ఎక్కువ. వీరితో పోలిస్టే పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువ అన్నారు ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పుడు, ఏదైనా నమూనాను ఉపయోగించి వాటిపై సరైన అంచనా వేయడం కష్టమని ఆయన అన్నారు. కానీ ఈ కరోనా ఎక్కువ కాలం ఉండదని మునుపటి అనుభవాలు చూపిస్తున్నాయి అని చెప్పారు.
ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న వైరస్ ఓమిక్రాన్ కొత్త ఉప-వేరియంట్ అని ప్రొఫెసర్ అగర్వాల్ చెప్పారు . 2022 నుంచి కొన్ని వేరియంట్ కారణంగా కేసులు అకస్మాత్తుగా పెరగడం చాలాసార్లు కనిపించింది. కానీ కొన్ని వారాల్లోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఈసారి కూడా అదే జరుగుతుందని చెప్పారు.
Also Read : కరోనాతో ఇద్దరు మృతి.. దేశంలో కొత్త వేరియంట్లు
అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని కోరారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కానీ భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం, జనసమూహాలను నివారించడం వంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కరోనా మళ్ళీ వచ్చి ఇబ్బంది పెడుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మునుపటిలా తీవ్రంగా లేదు. టీకా ప్రభావం, ప్రజలలో ఇప్పటికే అభివృద్ధి చెందిన రోగనిరోధక శక్తి కారణంగా, దాని ప్రభావం పరిమితం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, మనం అప్రమత్తంగా ఉండాలి కానీ భయపడకూడదు. ఈ ఐఐటీ కాన్పూర్ చెప్పనట్టు కరోనా త్వరలోనే తన తోక ముడిచే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు.