కరోనా మహమ్మరి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈనెల 31వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఎవరైతే లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపై ప్రభుత్వం యంత్రాంగం కొరడా ఝుళిపిస్తోంది. అవనసరంగా రోడ్లపై వచ్చేవారిని పోలీసులు క్లాస్ తీసుకుంటున్నారు. వారిని తిరిగి ఇంటికి పంపిస్తున్నారు. అలాగే వాహనాలతో రోడ్లపైకి వచ్చే వారికి జరిమానాలతోపాటు సీజ్ చేస్తున్నారు. సోమవారం ఒకేరోజు 3వేలకు పైగా వాహనాలను సీజ్ చేయడంతోపాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం అందరికీ అర్థమయ్యేలా తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం-2005, అంటువ్యాధుల(నియంత్రణ) చట్టం-1897 కింద లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. దేశంలోని 75జిల్లాలో కేంద్రం లాక్డౌన్ చర్యలు తీసుకుంటుంది. ఇందులో తెలంగాణలోని ఐదు జిల్లాలు, ఏపీలోని మూడు జిల్లాలు ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలోని అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. సరూర్‌నగర్ పీఎస్ లోని కొత్తపేట చౌరస్తాలో సరైన కారణాలు లేకుండా బయటకు వచ్చిన ఐదు కార్లను, ఎనిమిది ద్విచక్రవాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రాజేంద్రనగర్ రోడ్లపై బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్న వారితో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలతో ప్రజలకు ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది.