తెలుగుదేశం పార్టీ 38వ ఆవిర్భావ దినోత్సవం కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఇళ్లకే పరిమితం అయ్యింది. పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి ఈ విధంగా ఎన్నడూ జరగలేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హైదరాబాద్ లోని వారి నివాసంలో పార్టీ వ్యస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వారి వారి ఇళ్ల వద్దే పార్టీ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడలో రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో తన నివాసంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. గ్రామంలోని వన్ సెంటర్లలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన ఒక్కరే వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇతర జిల్లాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు వారి వారి ఇళ్ళవద్దే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కరోనా ప్రభావంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం బహిరంగంగా భారీ స్థాయిలో నిర్వహించలేక పోవడం నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంతకు మించి మరో మార్గం కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.