తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరగడమేగానీ తగ్గడం లేదు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కొద్దరోజులుగా ప్రతిరోజు 500పైగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళనను రేకెత్తిస్తోంది. ఊహించని రీతిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో జీహెచ్ఎంసీ తాజాగా సంచలనం నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్రజలెవరూ రావవద్దని సూచించింది. ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఆన్ లైన్లోనే సంప్రదించాలని, కార్యాలయానికి వస్తే మాత్రం అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈమేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారు. దీంతో వారంతా హోంక్వారంట్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ సైతం కరోనా బారి నుంచి త్రుటితో తప్పించుకున్నారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులు కరోనా బారిన పడుతుండటంతో జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని పనులు, ఫిర్యాదులకు సంబంధించి ప్రజలు ఆన్ లైన్లోనే సంప్రదించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యాలయాల్లోని ప్రజలను అనుమతించడం లేదని పేర్కొంది.
రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 872కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 713, రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్‌లో 16, సంగారెడ్డిలో 12, వరంగల్ రూరల్ జిల్లా 6, మంచిర్యాలలో 5, కామారెడ్డి 3, మెదక్ జిల్లాలో 3, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలో 2 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం కరోనాతో ఏడుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో మొత్తంగా 8,674పాజిటివ్ కేసులు నమోదుకాగా 217మంది మృత్యువాత పడ్డారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.