
గత కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రాజధానిలో కోవిద్ కేసులు తగ్గక పోవడం కొంత ఆందోళనకరంగా ఉంది. నిన్న ఒక్కరోజే మరో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. దింతో మొత్తం బాధితుల సంఖ్య 1038కి పెరిగింది.ఈ మహమ్మారికి రాష్ట్రంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 28కి చేరింది.తాజాగా నమోదైన అన్ని కేసులు కూడా హైదరాబాద్ పరిధిలోనివే కావడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా రాజధానిలోనే బాధితులు పెరుగుతున్నారు. తాజా కేసుల్లో మార్కెట్లో పనిచేస్తున్న వారి ద్వారా పలువురికి వ్యాప్తి చెందినట్లుగా గుర్తించారు. మలక్‌పేటగంజ్‌లో పనిచేస్తున్న పహాడీషరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల ద్వారా మార్కెట్లో మరో మూడు షాపుల యజమానులకు ఈ వైరస్ సోకింది. తద్వారా వారి కుటుంబసభ్యులకూ కొవిడ్ వ్యాప్తి చెందడంతో వారందరినీ ఐసోలేషన్ లో ఉంచారు.మలక్ పేటగంజ్, పహాడీషరీఫ్ లను కంటెయిన్ మెంటు ప్రాంతాలుగా ప్రకటించారు.
మరోవైపు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖ బృందం (ఐఎంసీటీ) సంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆ బృందం కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, కొన్ని లోపాల గురించి అందులో పేర్కొంది.