
గతవారం భారత్ లో కరోనా కేసుల సంఖ్య కంటే ఈవారం కోవిద్ కేసుల సంఖ్య పెరిగింది. గతవారం యావరేజ్ కరోనా కేసుల సంఖ్య మూడు వేలు ఉండగా ఈవారం నాలుగు వేలు దాటింది. దింతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఏ రోజూ నమోదుకానన్ని అత్యధిక కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 4,213 మందికి కొత్తగా కరోనా సోకింది. 24 గంటల్లో భారత్ లో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,206కి చేరింది. కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 67,152కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 20,917 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 44,029 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు విడుదల చేసింది.
వైరస్ వ్యాప్తి ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22171కి చేరింది. వైరస్ కారణంగా 832 మంది మరణించారు. గుజరాత్ లో మొత్తం 8194 కరోనా కేసులు నమోదవగా, 493 మంది మృతిచెందారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 7200కు చెరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 6923కు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 3614 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 214 మంది మృతిచెందారు.
ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్పరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. వైరస్ ను కట్టడి చేయడం, లాక్ డౌన్ ఆంక్షల సడలింపు వంటి అంశాలపై మోదీ చర్చించనున్నారు. మరోవైపు కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం రెడ్ జోన్లుగా ఉన్న వాటిని ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్పుచెందేలా చూడటం, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.