
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 107 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. అందులో తెలంగాణకు సంబంధించి 39 కేసులు కాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 69 మందికి ఈ రోజు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వలస కూలీలు 19 మంది, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయింది. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1842గా ఉంది. వలస కూలీలు, ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకిన వారి సంఖ్య 297గా ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో 1321 మంది డిశ్చార్జ్ అయ్యారు. 63 మంది ప్రాణాలు కోల్పోయారు. 714 మంది యాక్టివ్ కరోనా పేషెంట్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కరోనాతో ఆరుగురు చనిపోయారు.
కరోనా విషయంలో ప్రజలు భయోత్పాతానికి గురి కావాల్సిన పనిలేదని, లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమీ లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఒక వేళ రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ, తగిన వైద్య సేవలు అందించడానికి వైద్య,ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు.