కరోనా’ సాయం అధికార పార్టీ నాయకులచే పంపిణీ..!

ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో గత కొద్ది రోజులుగా పనులు లేక ఖాళీగా ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని (కరోనా రిలీఫ్ ఫండ్)శనివారం నుండి ఆయా గ్రామ వాలంటీర్లు పంపిణీ చేయవలసి ఉండగా వాలంటీర్లతోపాటు ఎంపిటిసి స్థానాలకు నామినేషన్ వేసిన అభ్యర్థులు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు రాష్ట్రంలో పలుచోట్ల బహిరంగంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టక […]

Written By: Neelambaram, Updated On : April 5, 2020 11:34 am
Follow us on


ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో గత కొద్ది రోజులుగా పనులు లేక ఖాళీగా ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని (కరోనా రిలీఫ్ ఫండ్)శనివారం నుండి ఆయా గ్రామ వాలంటీర్లు పంపిణీ చేయవలసి ఉండగా వాలంటీర్లతోపాటు ఎంపిటిసి స్థానాలకు నామినేషన్ వేసిన అభ్యర్థులు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు రాష్ట్రంలో పలుచోట్ల బహిరంగంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టక పోవడంతో ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎంపీటీసీలకు నామినేషన్ వేసిన అభ్యర్థులు ఇలాంటి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు పక్కాగా ఉన్నా ఎన్నికలకు ప్రత్యేకంగా నియమించిన మండల స్థాయి అధికారులు వీరిపై ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే గ్రామ వాలంటీర్లు కూడా ఎంపీటీసీలకు పోటీ చేసిన అభ్యర్థులతోనే వెయ్యి రూపాయలను ప్రజలకు అందజేయటంపై గ్రామాల్లో చర్చలు సాగుతున్నాయి. ఇటువంటి సంఘటనలపై పలు ఆధారాలతో ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేయనున్నాయి.

అలాగే అలాంటి వలంటీర్లపై ఆధారాలతో పోలీసులు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఆధారాలను సేకరించినట్లు తెలియవచ్చింది.

కరోనా ప్రత్యేక సాయం పంపిణీ దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ పేర్కొంది. ఈ సంఘటనలపై గవర్నర్ బిశ్వ భూషణ్ కు పిర్యాదు చేసారు. సంక్షోభంలోను స్వార్థ రాజకీయం సరి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తితో దేశం, రాష్ట్రం తీవ్రఇబ్బందిలో ఉన్న ఈ పరిస్థితుల్లో విపత్తు నిర్వహణ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సొంత నిధులుగా స్టిక్కర్ వేసి వాలంటీర్లతో కలిసి వైసీపీ కార్యకర్తలు తమపార్టీ ఇస్తున్నట్లు పంచడాన్ని తప్పుబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.