
కేంద్రంలోని బీజేపీ సర్కార్-మోడీపై పల్లెత్తు మాట అనకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కేసీఆర్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో నంబర్ 2 అయిన మంత్రి కేటీఆర్ మాత్రం బీజేపీ అంటేనే మండిపడుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలకు కౌంటర్లు ఇస్తూ.. దాడులు చేస్తే ప్రతిదాడులకు సిద్ధమంటూ తొడగొడుతున్నారు. ఏపీలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి మద్దతుగా కూడా పోరాడే వరకు కేటీఆర్ దూకుడు ఉందంటే ఆయన బీజేపీని ఎంత టార్గెట్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిధులు ఇవ్వకున్నా ఒక్క మాట కూడా అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడలేదు. కానీ కేటీఆర్ మాత్రం తాజాగా కడిగేశాడు. మోడీ సర్కార్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై కాస్త గట్టిగానే నిలదీశాడు. బీజేపీ అంటే విరుచుకుపడుతున్న కేటీఆర్ తీరు ఆసక్తి రేపుతోంది.
మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. తెలంగాణకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ ఆరున్నరేళ్లలో కేంద్రం నుంచి ఒక్క పైసా సాయం రాలేదని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. పార్లమెంట్ చట్టాన్ని బీజేపీ సర్కార్ తుంగలోతొక్కేసిందని మండిపడ్డారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి, వ్యాపారవేత్లకు ఎలాంటి ఉపయోగం లేదని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. వ్యాపారవేత్తలే ఈ విషయం చెప్పారని వివరించారు.
మోడీ సర్కార్ ప్యాకేజీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. వీధి వ్యాపారులకు మాత్రం రూ.10వేల రుణసాయం పొందేందుకు కొంత మేర ఉపయోగపడినట్టు తెలుస్తోందన్నారు.
దీన్ని తండ్రీ కొడుకులు ఇద్దరూ బీజేపీ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. బీజేపీతో ఢీ అంటే ఢీ అనేందుకు కేటీఆర్ రెడీ కాగా.. కేసీఆర్ మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సంయమనం పాటిస్తున్నాడు.