Chandrababu: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ పై వివాదం నెలకొంది. ఆయన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని.. ఆయనకు తక్షణ వైద్య సేవలు అవసరమని.. అందుకే మధ్యంతర బెయిల్ గడువు పెంచాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అందుకు సంబంధించి మెడికల్ రిపోర్టును హైకోర్టుకు సమర్పించారు.అయితే దీనిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అది నిజమైన మెడికల్ రిపోర్ట్ కాదని.. టిడిపి కార్యాలయంలో తయారుచేసినదని.. బెయిల్ కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇది రెండు పార్టీల వివాదంగా మారింది.
ముందుగా ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు బెయిల్ గడువు పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. బెయిల్ పొడిగించుకునేందుకు చంద్రబాబు న్యాయవాదులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అటు తర్వాత మంత్రి సిదిరి అప్పలరాజు చంద్రబాబు ఆరోగ్య రిపోర్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు సంబంధించిన చంద్రబాబు మెడికల్ రిపోర్టు చూస్తే పలు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అవే అనారోగ్య పరిస్థితులు ఉంటే కంటికి వైద్యం చేయడం అసాధ్యమని.. ఆ సాహసం చేయడానికి వైద్యులెవరూ ముందుకు రారని తేల్చేశారు.మంత్రి అప్పలరాజు స్వతహాగా డాక్టర్. గుండె సంబంధిత వైద్య నిపుణుడు కూడా. ఆయన లేవనెత్తిన అంశాలు చూస్తుంటే చంద్రబాబు మెడికల్ రిపోర్టులో తప్పులు తడకలు ఉన్నట్లు అవుతుంది.
అయితే దీనిపై టిడిపి, జనసేన పార్టీలు స్పందించాయి. 73 సంవత్సరాల వయసున్న నేత విషయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం తగదని.. అనారోగ్య సమస్యలను సైతం భూతద్దంలో పెట్టి చూపడం దారుణ చర్యగా అభివర్ణిస్తున్నారు. కనీసం చంద్రబాబు వయసు రీత్యా ఆయనకు విశ్రాంతి అవసరమని ఆలోచించకపోవడం అన్యాయమని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఆధారాలు లేని కేసులో 52 రోజులు పాటు జైల్లో పెట్టారని.. బెయిల్ పై వచ్చినా విడిచిపెట్టడం లేదని.. మరోసారి జైల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తుండడాన్ని తప్పుపడుతున్నారు. పగ, ప్రతీకార రాజకీయాలతో వైసీపీ నేతలు ముందుకు సాగుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని జనసేన నాయకులు తేల్చి చెబుతున్నారు. కాగా ఈనెల 28 వరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని.. ఆయనకు విశ్రాంతి అవసరమని ఆయన తరుపు న్యాయవాదులు కోర్టుకు మెడికల్ రిపోర్ట్ సమర్పించారు. దీనిపై న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం వెల్లడిస్తుందో చూడాలి. వైసీపీ నేతలు మాత్రం ఆ మెడికల్ రిపోర్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందో? లేదో? చూడాలి.