హుజురాబాద్ ఉప ఎన్నికలో దళితబంధు పథకం రాజకీయ పార్టీల్లో రగడ రేపుతోంది రాష్ర్టమంతా అమలు చేయాలని డిమాండ్లు పెరగడంతో ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచిస్తోంది. కొందరు నిరసనకు దిగుతున్నారు. ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారుతోంది. ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో దళితులందరికి అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు కొందరు పురుగుల మందు డబ్బాలతో ధర్నా చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పాటు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దళితబంధు పథకం రాష్ర్టమంతా అమలు చేయాలని ఇప్పటికే నిరసనలు పెరగడంతో ప్రభుత్వం ఇరుకున పడినట్లు అయింది. ఎమ్మార్పీఎస్, దళిత సంఘాలు సంయుక్తంగా వరంగల్ లో మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 31 నాటికి రాష్ర్టంలోని అన్ని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింపచేయాలని పేర్కొన్నారు. లేకుంటే సెప్టెంబర్ 5న హుజురాబాద్ లో దళిత గర్జన సభ నిర్వహించి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
దళితబంధు కోసం ప్రభుత్వం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తామని చెప్పడంతో దళితుల్లో ఆశలు పెరిగాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే బడ్జెట్ విడుదలచేసి దళితుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరారు. దళితులందరికి పథకం వర్తింపచేసి తన మాట నిలుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం మేరకు పనులు కూడా చురుకుగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు.
మరోవైపు ప్రతిపక్షాలు సైతం గోల చేస్తున్నాయి. ఎన్నికలప్పుడే సీఎంకు దళితులు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం దళితబంధు పథకంతో అందరి అవసరాలు తీర్చాలని అడుగుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నకపై ప్రభుత్వం కపట ప్రేమ ఒలకబోస్తుందని చెబుతున్నారు. ఎన్ని నాటకాలు ఆడినా ఓటర్లు కీలెరిగి వాత పెడతారని ప్రతిపక్షాలు హితవు పలుకుతున్నాయి.