AP Police Survey: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని జగన్ పావులు కదుపుతున్నారా? అందులో భాగమే గృహసారథుల నియామకమా? ప్రతీ 50 కుటుంబాల్లో మెజార్టీ ఓట్లు వైసీపీకి దక్కేలా చేయడమే వ్యూహమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ సర్కారు ఇంటింటా చేపడుతున్న సర్వే ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తిగత గోప్యతకు విఘాతం, కుటుంబంలో చిచ్చుపెట్టేలా ఉంది. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి 12 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అవి కుటుంబసభ్యులకు చికాకు తెప్పించేలా ఉన్నాయి. అటు సచివాలయ మహిళా పోలీసులు సైతం ప్రశ్నలు వేసినప్పుడు అసౌకర్యానికి గురవుతున్నారు.కొందరు చాలా కోపంగా రియాక్డవుతున్నారు. వీరు అడుగుతున్న ప్రశ్నలు కుటుంబ జీవనానికి విఘాతం కలిగించేలా.. నలుగురిలో నవ్వులపాలు చేసే విధంగా ఉండడంతో వారు ఫైరవుతున్నారు.

అయితే పోలీస్ శాఖ ఆదేశించడంతో అటు సచివాలయ ఉద్యోగులకు, వలంటీర్లకు ప్రాణ సంకటంగా మారింది. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే క్రమంలో చీవాట్లు తినాల్సి వస్తోంది. పిచ్చికి పరాకాష్టంగా ప్రశ్నలుండడం అంతటా ఇదే చర్చనీయాంశంగా మారుతోంది. ‘మీ ఇంట్లో వివాహేతర సంబంధాలున్నాయా? బహుళ లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారా? ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారా? వీటికి సంబంధించి పాత కేసులు ఏమైనా ఉన్నాయా? అని అడుగుతున్నారు. ‘నేరాలకు దారితీసేందుకు అవకాశమున్న పాత విరోధాల వివరాల సేకరణ’ పేరిట ఏపీ పోలీసులు చేపడుతున్న సర్వే ప్రజలకు అసౌకర్యానికి గురిచేస్తోంది. మహిళా పోలీసులు వలంటీర్లతో కలిసి వెళ్లి చేస్తున్నప్రక్రియకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రజల నుంచి ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి.
అయితే కేవలం వ్యక్తిగత ప్రశ్నలే కాకుండా మిగతా వాటిని కెలుకుతూ ప్రశ్నలు ఉన్నాయి. ఇంట్లో వ్యక్తులకు సంబంధించి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఆస్తి, సరిహద్దు వివాదాలు, గృహహింస కేసులు, మద్యం తాగే అలవాట్లు, ఈవ్ టీజింగ్, బహిరంగ మద్య, దూమపానం, కుల, మత, రాజకీయాలకు సంబంధించి కేసులు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. మొత్తం 12 రకాల ప్రశ్నలు అడిగి.. వాటి సమాధానాలను నమోదుచేసుకుంటున్నారు. సాయంత్రం 7 గంటలకు స్టేషన్ అధికారికి సమర్పిస్తున్నారు. కొన్ని రోజులుగా ఏపీలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

వచ్చే ఎన్నికలు అంత సులభంగా జరగవన్న విపక్ష నేతల హెచ్చరికల నడుమ ఇటువంటి సర్వేలు జరుపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల వ్యక్తిగత, గోప్యత సమాచారాన్ని, కుటుంబ జీవనానికి విఘాతం కలిగించే విషయాలపై సర్వే చేయడం ఏమిటని విపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో కేసులను అడ్డం పెట్టుకొని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసేందుకే వివరాలు సేకరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. దీనిపై ప్రభుత్వం, పోలీస్ శాఖ స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.