Sneezing: ఫర్ సపోజ్… మీరు ఏదో పని మీద బయటకు వెళ్తున్నారు. హఠాత్తుగా ఒక వ్యక్తి ఎదురు పడి ఒక్క తుమ్ము తుమ్మాడు. వెంటనే ఏం చేస్తారు? వెనక్కి తిరిగి వస్తారు? కొద్ది సేపయ్యాక మళ్ళీ తిరిగి వెళ్తారు. ఇదే అరబ్ దేశాల్లో అయితే ” అల్లా మిమ్మల్ని కాపాడతాడు” అనుకొని ముందుకు సాగుతారు.. సాధారణంగా తుమ్ము అనేది మన శరీర చర్యల్లో ఒకటి.. శరీరంలోకి ఫారిన్ బాడీలు ప్రవేశించినప్పుడు గాని… శరీరం ఏదైనా మార్పులకు గురైనప్పుడు కానీ… వాతావరణంలో తేడా ఉన్నప్పుడు గానీ తుమ్ములు వస్తాయి. ఇలాంటప్పుడు కొద్ది సెకండ్ల పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. సైనస్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నవారికి యథా లాపంగా తుమ్ములు వస్తాయి. ఇలాంటి సమయంలో ముక్కు నుంచి విడుదలయ్యే శ్లేష్మం ద్వారా పేరుకుపోయిన వ్యర్ధాలు బయటికి పోతాయి.

ఒక్కో దేశంలో ఒక్కో విధంగా
వాస్తవానికి కొన్ని ఆసియా దేశాల్లో తుమ్మితే ఎటువంటి స్పందన ఉండదు.. ఉదాహరణకు చైనా, కొరియా, తైవాన్, జపాన్, మలేషియా వంటి దేశాల్లో తుమ్ముకు ప్రతిస్పందించడం అనేది ఉండదు.. ఇస్లామిక్ సంస్కృతిలో తుమ్ములు అనేవి మనసును తేలిక పరుస్తాయని నమ్ముతారు. తుమ్మినప్పుడు కచ్చితంగా అల్లాను స్తుతించాలి.. క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో మనుషులకు తుమ్ములు వచ్చినప్పుడు అవి ఎలుకల ద్వారా వచ్చే భయంకరమైన ప్లేగును నివారిస్తాయని నమ్మేవారు. ఇదే విషయాన్ని పోప్ జార్జ్ అనే మత బోధకుడు.. ” దేవుడు తుమ్ము రూపంలో రాబోయే అనర్థాలను సంకేతాల రూపంలో ఇస్తున్నాడని” చెప్పేవాడు.. ఇక గ్రీకు దేశంలో అయితే తుమ్ములు వచ్చినప్పుడు దేవుడు సంకేతాలు ఇస్తున్నాడని, మంచి జీవితం లభిస్తుందని నమ్మేవారు. తుమ్ములు జుపిటర్ దేవుడి సంకేతాలని విశ్వసించేవారు. ఇక డచ్ దేశం లో అయితే తుమ్మితే ఎక్కువ కాలం జీవించమని ఎదుటివారు దీవిస్తారు. మధ్య ఆఫ్రికాలో అయితే తుమ్ములు తుమ్మితే పెద్దవారు ఒక రకమైన చూపు చూస్తారు. తుమ్ము తమ జీవిత కాలాన్ని తగ్గిస్తాయని పెద్దలు నమ్ముతారు.

కోవిడ్ తర్వాత అంతా మారింది
కోవిడ్ సమయంలో మూతికి మాస్క్ అనేది తప్పనిసరి అయింది. దీనివల్ల వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన బాగా పెరిగింది.. కానీ ఇదే సమయంలో ఎదుటి వ్యక్తి తుమ్మినా, జలుబు బారిన పడినా దూరంగా వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎదుటి మనిషిని కనీసం తాకేందుకు కూడా ఇష్టత చూపని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికి కూడా పాశ్చాత్య దేశాల్లో తుమ్ములు తుమ్మితే ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తున్నారు.. ప్రస్తుతం చైనాలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అక్కడ కోవిడ్ బీఎఫ్. 7 వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజల్లో ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఇదండీ ఒక తుమ్ము వెనుక ఉన్న చరిత్ర. మీరు మామూలు తుమమ్మే అనుకుంటారు కానీ.. దానిపై ప్రపంచం స్పందించే తీరు వేరుగా ఉంటుంది.