ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అధ్వానస్థితిలో ఉన్నాయి. అడుగు తీసి అడుగు వేయకుండా మారాయి. దీంతో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ అక్టోబర్ 2న శ్రమదానం చేసింది. అయినా ప్రభుత్వంలో చలనం లేకుండా పోతోంది. వైసీపీ సర్కారు అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్లు బాగు చేయడం పరిపాటే. ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం సమస్త రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రెండున్నరేళ్లుగా రోడ్లకు మరమ్మతులు చేపట్టడం లేదు ఫలితంగా నడవడానికి కూడా వీలు లేకుండా దారుణంగా మారాయి.
ప్రభుత్వం రోడ్ల మరమ్మతుకు టెండర్లు వేస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం ముందుకు రావడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో వారు సుముఖత వ్యక్తం చేయడం లేదు. వైసీసీ సర్కారు మాత్రం గత ప్రభుత్వం వేసిన టెంటర్లకు తామెందుకు డబ్బులు చెల్లిస్తామని బుకాయించడంతో ఇపుడు మొదటికే మోసం వస్తోంది. కాంట్రాక్టర్ల చర్యతో సర్కారు ఇరకాటంలో పడుతోంది.
ప్రతిపక్షాలకు రోడ్ల సమస్య ఓ వరంలా మారుతోంది. ఇప్పటికే జనసేన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న క్రమంలో టీడీపీ కూడా వంత పాడుతోంది. అయినా వైసీపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. నియోజకవర్గాల్లో రోడ్ల దారుణ స్థితిని చూసి ఎమ్మెల్యేలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రోడ్ల అభివృద్ధి సంస్థకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. కాంట్రాక్టర్లు మాత్రం ముందుకు రావడం లేదు.
రోడ్ల మరమ్మతు విషయంలో వైసీపీ ఇంతవరకు ఎలాంటి పనులు చేపట్టడం లేదు. పాడైపోయిన రోడ్లకు రిపేర్ చేయాలని భావించినా కాంట్రాక్టర్ల నుంచి ఎలాంటి ఆమోదం రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా రోడ్ల భవితవ్యం అగమ్యగోచరంగా మారుతోంది. అయినా ప్రభుత్వంలో చలనం లేకుండా పోతోంది. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సైతం నిర్లక్ష్యం చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.
