మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కి మంచు విష్ణుకి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. పోటీ తీవ్రత దెబ్బకు ఎన్నికల హడావుడి రోజుకో మలుపు తిరుగుతూ సాగుతుంది. అయితే జీవితా రాజశేఖర్ ఎన్నికల పై తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘తప్పులు అందరూ చేస్తారు. వాటిని సరిదిద్దుకుంటాం. ఇక ఎవరు ఏ ప్యానెల్‌లో ఉంటారన్నది వాళ్ల ఇష్టం. బండ్ల గణేశ్ నా గురించి చాలా మాట్లాడారు. అందుకే అతని పై మాట్లాడాల్సి వచ్చింది.
ఇక పృథ్వీ అయితే నా పై ఈసీకి ఫిర్యాదు కూడా చేశాడు. ఇది హాస్యాస్పదం. నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు.. అంతా జీవితా రాజశేఖర్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? మంచి చేయడమే మేం చేస్తున్న తప్పా ? అంటూ అని ఎమోషనలౌతూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకోవడం ఆసక్తిని పెంచింది.
ఇంతకీ ఎన్టీఆర్ గురించి ఏం చెప్పింది అంటే.. ‘ఇటీవల నేను ఓ పార్టీలో జూ.ఎన్టీఆర్ గారిని కలిశాను. ఆయన చాలా బాగా మాట్లాడారు. ఈ సందర్భంలోనే నేను ఆయనతో ‘మీరు నాకు ఓటు వేయాలి’ అని అడిగాను. దానికి ఆయన ఏమన్నారో తెలుసా ? ‘దయచేసి నన్ను అడగొద్దు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే నాకు చాలా బాధాకరంగా ఉంది’ అని ఎన్టీఆర్ అన్నారు. నిజంగానే ఎన్టీఆర్ చెప్పినట్లే పరిస్థితి ఉంది’ అని జీవిత కామెంట్స్ చేయడం విశేషం.
అన్నట్టు జీవిత మంచు ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. ‘నాకు మోహన్ బాబుగారు, విష్ణు అంటే ఎంతో గౌరవం ఉంది. అయితే, విష్ణు తన సామర్థ్యంతో పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. కానీ నరేశ్ ను వెనకేసుకుని తిరగడమే బాగాలేదు. ఇక మీకు ఓట్లు వేసిన వారికే సాయం చేస్తామంటారు. హే.. ? మొత్తం 900 మందికి సాయం చేస్తామని చెప్పొచ్చు కదా. అయినా ఒకరిపై ఒకరు అనుచితమైన కామెంట్స్ చేసుకోవడం మంచిది కాదు’ అని అన్నారు.
అలాగే జీవిత మిగిలిన అంశాల పై కూడా తనదైన శైలిలో స్పందించారు. వాటిల్లో ముఖ్యంగా ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయ వాదాన్ని తీసుకురావడాన్ని తప్పుబట్టారు. ఇక గతంలో ‘మా’ ఎన్నికల్లో తమ ఫ్యామిలీ నరేశ్ కి సపోర్ట్ చేసిందని.. ఆయన ఎవరిని తిడితే వాళ్లను తిట్టామని, అలా నరేశ్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చాం అని, కానీ కొన్ని విషయాల్లో నరేశ్ ధోరణి మాకు నచ్చలేదు అని ఆమె చెప్పారు.
