యూట్యూబ్ లో పాపులారిటీ సంపాదించి బిగ్ బాస్ లోకి వెళ్లి క్రేజ్ తెచ్చుకున్న గంగవ్వ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే కీలక పాత్రను కొట్టేసింది. పైగా చిరంజీవికి గంగవ్వ తల్లిగా నటిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా గంగవ్వ వెల్లడించడం విశేషం. లవ్‌స్టోరీ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూ లో గంగవ్వ మాట్లాడుతూ.. ‘చిరంజీవి సర్ మూవీ కోసం ఊటీ వెళ్లాను, ఆ సినిమాలో చిరు సర్ కు అమ్మగా నటిస్తున్నాను; అంటూ సగర్వంగా చెప్పుకొచ్చింది గంగవ్వ. మొత్తానికి మెగాస్టార్‌కు తల్లిగా నటించడం అంటే.. గంగవ్వ సినీ జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి అనుకోవచ్చు.
ఇక ఈ ‘గాడ్ ఫాదర్ ’ సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గంగవ్వ పాత్ర కూడా ఉండబోతుంది. అయితే గంగవ్వ చిరుకి కన్నతల్లిగా నటించడం లేదు. పెంచిన తల్లి గా కనిపించనుంది. అనాధగా మారిన చిరుని చిన్న తనం నుంచి పెంచి పెద్ద చేసే పాత్రలోనే గంగవ్వ నటించబోతుంది. పైగా గంగవ్వ పాత్ర ఎండింగ్ చాలా ఎమోషనల్ గా ఉంటుందట.
విలన్స్ ఆమె పాత్రను దారుణంగా చంపేస్తారని.. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఎమోషనల్ అవుతాడని తెలుస్తోంది. మొత్తానికి గంగవ్వ షాకింగ్ విషయమే బయట పెట్టింది. అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ కి సోదరిగా లేడి సూపర్‌స్టార్ నయనతార నటించబోతుంది. అలాగే తమ్ముడు పాత్రలో యంగ్ హీరో సత్యదేవ్ కనిపించబోతున్నాడు.
వచ్చే వారం నుంచి ఈ ‘గాడ్ ఫాదర్’ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేయనున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్ ఈ సినిమా కోసం రెండు సాంగ్స్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్, ఒక బిట్ సాంగ్ ఉండబోతున్నాయి.
