ఆంధ్రాలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఒకేసారి పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు నిర్వహించటం ఎన్నికల కమిటీకి కత్తిమీదసాములాంటిదే. అలాగే రాజకీయపార్టీలకు కూడా. జగన్ ప్రభుత్వపు ఈ 9 నెలల పనితీరుపై దీన్ని ప్రజా తీర్పుగా చెప్పొచ్చు. అలాగే ఇది గత 9 నెలల చంద్రబాబు నాయుడి రాజకీయ కార్యకలాపాలపై కూడా తీర్పే. జగన్ అధికారం లోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు వ్యతిరేక కార్యకలాపాలు మొదలుపెట్టటం వ్యూహాత్మక తప్పిదం. ఏ ప్రభుత్వానికైనా కనీసం ఒక సంవత్సరం టైమివ్వాలి. ఆ తర్వాత మాట్లాడితే జనం వింటారు. అంతేగానీ ఓడిపోయిన వెంటనే కొత్త ప్రభుత్వం తప్పిదాలను వెతకటం మొదలుపెడితే జనం హర్షించరు. ఇది జనం తరఫున మాట్లాడినట్లు ఉండదు. అక్కసు పట్టలేక మాట్లాడినట్లు వుంటుంది. కాకపోతే మీడియా అండచూసుకొని ముందుగానే రోడ్డునపడటం తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లయింది. ఇంత హైప్ కి తీసుకెళ్లి ఎన్నికల్లో చతికల పడితే వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఏమి మాట్లాడినా ప్రజల్లో విశ్వసనీయత ఉండదు. చంద్రబాబునాయుడు రాజకీయ అనుభవం ఈ మాత్రం అర్ధంచేసుకోవటానికి ఉపయోగపడలేదంటే కెసిఆర్ చెప్పినట్లు ఎక్కడో నాయకత్వ లక్షణం కొరవడిందనిపిస్తుంది. నాయకుడికి కావాల్సింది అనుచరుల ఆవేశంతో తాను నడవటం కాదు తన దూరదృష్టితో పార్టీని నడపటం. మీడియా అండతో ప్రజల అభిప్రాయాల్ని మలచటం పాత పద్దతి. ప్రజలు చాలా ముందున్నారు. ఏది రైట్ ఏది రాంగ్ వాళ్లకు వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. 21వ శతాబ్దపు ఆలోచనలను ఆకళింపు చేసుకోకుండా పాత పద్దతిలోనే రాజకీయాలు నడపటం కష్టం. మొత్తమ్మీద చూస్తే చంద్రబాబు నాయుడు వ్యూహం బెడిసికొట్టిందనే చెప్పాలి.
ఇప్పుడు పోటీ జగన్ కి చంద్రబాబు నాయుడుకి కాదు. నా అంచనా ప్రకారం జగన్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఈ ఎన్నికల్లోనూ పూర్తి ఆధిక్యత ప్రదర్శించటం ఖాయం. ఇది చంద్రబాబు నాయుడుకి పెద్ద దెబ్బే. దీనితో క్యాడర్ లో నైరాశ్యం అలుముకోకుండా చూసుకోవాలి. వాస్తవానికి ఇప్పుడు పోటీ రెండో స్థానానికి. బీజేపీ-జనసేన కూటమి మొదటిసారి ఎన్నికలబరిలో పరీక్షించుకోబోతుంది. ఈ కూటమి నిజంగానే ఎన్నికల్లో సీరియస్ ప్లేయరా? ఇది ఇప్పుడు అందరి మనస్సులో తొలుస్తున్న ప్రశ్న. కాకపోతే ఈ 9 నెలల కాలంలో బీజేపీ-జనసేన మూడో ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయింది. అందుకు ప్రధానకారణం జనసేన తెలుగుదేశం బి టీం అని వైస్సార్సీపీ జనంలో తీసుకెళ్లిన ప్రచారం ఇంకా ప్రజల్లో అలానే ఉందని అనిపిస్తుంది. దాన్ని ప్రజల మనసుల్లోంచి తొలగించటానికి ఈ 9 నెలల్లో ఎటువంటి ప్రయత్నమూ చేసినట్లు కనబడలేదు. కాకపోగా తెలుగుదేశం బాటలోనే ఇంకొంచెం ముందుకు ప్రయాణం చేసినట్లు జనం అనుకొనే అవకాశాలు మెండుగా వున్నాయి. జనసేన కు అర్జంటుగా ఒక స్ట్రాటెజిస్ట్ కావాలి. ఆ కొరత ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇక బీజేపీ విషయాన్ని కొస్తే రాష్ట్ర పార్టీలో వర్తమాన రాజకీయాలపై ఎవరి ధోరణి వారిదిలాగే కనబడుతుంది. పాత నాయకులకు, కొత్తగా వచ్చిన నాయకులకు ఎక్కడా పొసుగుతున్నట్లుగాలేదు. ముఖ్యంగా రాజధాని విషయంపై ఇరువర్గాల్లో తీవ్ర విభేదాలు ఉన్నట్లు ప్రతిఒక్కరికి అర్ధమవుతుంది. ఇదీ ఈ రెండు పార్టీల పరిస్థితి. ఈ నేపథ్యంతో ఒక కూటమిగా ఏర్పడటమైతే జరిగిందిగానీ ఇంతవరకు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలూ మొదలుకాలేదు. అటువంటప్పుడు ఎన్నికల్లో ఏమి ప్రభావం చూపిస్తుంది? ఈ లోపల పవన్ కళ్యాణ్ సినిమా షూటింగులో బిజీ అయిపోయాడు. సినిమాల్లో నటించటం తప్పుకాదుగానీ టైమింగ్ కరెక్టు కాదేమోననిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తాయని అందరికీ తెలుసు. ఈ ఎన్నికల తర్వాత దాదాపు 4 సంవత్సరాలు ఎటువంటి ఎన్నికలూ లేవు. కాబట్టి ఈ ఎన్నికల తర్వాత సినిమా షూటింగులు పెట్టుకోనుంటే బాగుండేది.
ఎన్నిచెప్పినా తెలుగుదేశం కి క్యాడర్ వుంది. ఎన్టీఆర్ పుణ్యమా అని తెలుగు ప్రజల్లో తెలుగుదేశానికి ఇప్పటికీ కొంత క్రేజ్ వుంది. రాష్టం విడిపోయిన తర్వాత ఆంధ్రాలో ఆ వారసత్వం కొనసాగుతుంది. తన స్వార్ధం కోసం తన నమ్మినబంటుల్ని బీజేపీ లోకి పంపించినా ఇప్పటికీ ప్రతి గ్రామంలో పార్టీ క్యాడర్ వుంది. అదే బీజేపీ-జనసేన కూటమికి ఆ క్యాడర్ లేదు. బీజేపీ కి ఎంతో కొంత పట్టణ ప్రాంతాల్లో వున్నా అది ఎన్నికల్లో గెలవటానికి సరిపోదు. జనసేనకు పవన్ కళ్యాణ్ క్రేజ్ వున్నా ఇంకా అది పూర్తిస్థాయిలో ప్రజల్లో స్థానం సంపాదించలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో రెండో పార్టీగా తెలుగుదేశమే ఉంటుంది. అయితే వైస్సార్సీపీ కి చాలా దూరంలో ఉంటుంది. బీజేపీ-జనసేన ఈ ఎన్నికలతో నిమిత్తం లేకుండా వచ్చే నాలుగు సంవత్సరాలు జనంలో పనిచేస్తే ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిగా ఎదిగే అవకాశముంది. అయితే ఇది ఈ రెండు పార్టీల వుమ్మడి కార్యకలాపాలపై ఆధారపడివుంటుంది. ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో ఈ కూటమి అవకాశాలు తక్కువే. అదీకాక ఇంత తక్కువ టైములో అటు పంచాయతీ ఇటు పట్టణ , నగర ఎన్నికలూ ఎదుర్కొనే సాధన సంపత్తి ఈ కూటమికి లేదనే చెప్పాలి. ఈ సారికి దూరంగానైనా రెండో స్థానం తెలుగుదేశమే కైవసం చేసుకుంటుంది. పవన్ అభిమానులకు ఇది వినటానికి ఇబ్బందిగావున్నా జరగబోయేది ఇదే. ఈ ఎన్నికల ఫలితాలు ఒకవైపే ఉంటాయి. దీనితో చంద్రబాబు నాయుడు , తనకు మద్దతిచ్చే మీడియా నోళ్లు కొన్నాళ్ళు మూతబడతాయి. అదే సమయం లో రాజధాని సమస్య కూడా బలహీన పడుతుంది. జాతీయ మీడియా ఇప్పటంత ప్రచారం కూడా ఇకనుంచి కల్పించక పోవచ్చు. జగన్ ఎత్తుగడ కూడా ఇదే. ఒకదెబ్బకు రెండు పిట్టలు. ఇదీ ఆంధ్ర స్థానిక ఎన్నికల ముఖచిత్రం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Contest for second place only
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com