Vizianagaram SP: సాధారణంగా వివిధ నేరాలకు పాల్పడేవారిని పోలీసులు అరెస్టు చేసి తమదైనశైలిలో విచారిస్తుంటారు. కొందరు నేరాగాళ్ల పట్ల కఠినంగా కూడా వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిని పోలీసులు బట్టలూడదీసి నగ్నంగా స్టేషన్లో కూర్చోబెడుతుంటారు. ఇలాంటి విషయాలను మనం తరచూ వింటుంటాం కూడా. కానీ, పోలీసుల దుస్తులనే ఊడదీసి… స్టేషన్లో కూర్చోబెట్టాడు ఓ పోలీస్ ఉన్నతాధికారి. ఆయన పేరు అరుణ్. విజయనగరం జిల్లా ఎస్పీ. ఆయన ఇలా ఎందుకు చేశారో తెలుసుకుందాం.

పేకాట సొమ్ము స్వాహా..
విజయనగరం పట్టణంలోని చలవారి కాలనీలో వెంకటేశ్, మరికొందరు బుధవారం రాత్రి పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కానిస్టేబుళ్లు మహేష్, అభిషేక్, మంజునాథ్, శ్రీకాంత్ పేకాట శిబిరంపై దాడిచేశారు. ఘటన స్థలంలో రూ.20 వేల నగదు, వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయకుండా స్వాధీనం చేసుకున్న డబ్బు, మొబైల్ ఫోన్లు స్వాహా చేశారు.
ఫోన్ల కోసం స్టేషన్‌కు వెళితే..
పేకాట ఆడుతుండగా పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోయిన వారు. మరుసటి రోజు స్టేషన్‌కు వెళ్లారు. తమ మొబైల్ ఫోన్లు ఇవ్వాలి పోలీసులను కోరారు. అలాంటి కేసు ఏదీ నమోదు కాలేదని డ్యూటీలో ఉన్న పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులకు పేకాట రాయుళ్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం జిల్లా ఎస్పీ అరుణ్ దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు.
స్వాహా చేసినట్లు తేలడంతో..
విచారణలో నలుగురు కానిస్టేబుళ్లు పేకాట శిబిరంపై దాడిచేసి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. వాటిని కాజేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఎస్పీ నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయించారు. నలుగురినీ సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత వారి స్టేషన్‌కు పిలిపించి దుస్తులు విప్పించి రెండు గంటలపాటు కూర్చోబెట్టారు. అనంతరం కోర్డులో హాజరుపర్చి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

భిన్నాభిప్రాయాలు..
విజయనగరం ఎస్పీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో అరుణ్ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతుండగా, ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తురన్నారు. వివిధ కేసుల నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారిని కూడా పోలీసులు పీక్కుతింటున్నారని కొందరు పేర్కొంటున్నారు. ఇలాంటి ఎస్పీ ఉంటే అవినీతి పోలీసులకు చెక్ పడుతుందని అరుణ్‌ను అభినందిస్తున్నారు. మరి ఎస్పీ నిర్ణయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.