YCP Politics: ప్రాంతీయ పార్టీల్లో వైసీపీది ప్రత్యేక స్థానం. తక్కువ కాలంలో రాజకీయ యవనికపై అగ్రస్థానానికి చేరుకుంది ఆ పార్టీ. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అధినేత మాటే శిరోధార్యం. ఆయన మాటే ఫైనల్. క్రమశిక్షణ రాహిత్యాన్ని ఆయన సహించరు. ఆయన ముందు మాట్లాడేందుకు ఎవరూ సాహసించరు. చాలా మంది ఇతర పార్టీ నాయకులు గత ఎన్నికల ముందు జగన్ గూటికి చేరారు. అటువంటి వారిలో చాలా మందికి దూకుడు ఎక్కువ. రాజకీయంగా నిత్యం హాట్ కామెంట్ చేసేవారు. అటువంటి వారు వైసీపీ నీడకు చేరిన తరువాత పరిస్థితి చూసి సైలెంట్ అయిపోయేవారు. మీడియాకు కూడా చిక్కేవారు కాదు. అయితే ఇదంతా మొన్నటి వరకూ సాగిన ఎపిసోడ్. ఇప్పుడు మాత్రం నేతలు రోడ్లపైకి వస్తున్నారు. పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. ఒకరికొకరు పొగ పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఇటీవల వెలుగుచూసిన ఘటనలు వైసీపీ అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇంతకాలం పార్టీ లైన్ దాటని నాయకులు ఇప్పుడు సడన్ గా కట్టుదాటుతుండడంపై పార్టీ పెద్దల్లో కలవరం ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తరువాతే వరుస ఘటనలు చోటు చేసుకోవడం విస్మయపరుస్తోంది. ఇన్నాళ్లు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు కొందరు పార్టీ కీలక నేతలే ఆజ్యం పోస్టున్నారని ఆరోపణలు రావడం సంచలనం రేకెత్తిస్తోంది. అటు బాధితులు, ఇటు బాధిస్తున్నవారు సీఎం జగన్ కు ఆత్మీయులు, దగ్గరివారే కావడం గమనార్హం.
ఒంగోలులో అలజడి..
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా బాంబు పేల్చారు. తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పార్టీ కీలక పెద్దలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా టీడీపీ నేతలతో చేతులు కలిపి తనను రాజకీయంగా దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మీడియా ముందుకొచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ పార్టీలో పెద్ద నాయకుడు పేరు అయితే వెల్లడించలేదు. అన్ని వివరాలు సేకరించి సీఎం జగన్ ముందు ఉంచుతానని మాత్రం ప్రకటించారు. అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మాత్రం స్పష్టం చేశారు.
Also Read: Mana Ooru Mana Badi Scheme: మన ఊరు మన బడి ఓ బడా కంపెనీకి
బాలినేని సీఎం జగన్ కు సమీప బంధువు. ప్రకాశం జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు. అందుకే జగన్ తన తొలి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. గత మూడేళ్లుగా పార్టీకి, అధినేతకు విధేయత కనబరుస్తూ బాలినేని పనిచేశారు. కానీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో మాత్రం ఆయన్ను తొలగించారు. అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను మాత్రం కొనసాగించారు. ఈ నిర్ణయం తనకు రాజకీయంగా ప్రతిబంధకంగా మారుతుందని బాలినేని చెప్పినా జగన్ వినలేదు. నన్ను తొలగిస్తే సురేష్ ను తొలగించాలని కోరినా ససేమిరా అన్నారు. దీంతో ఒకటి, రెండు రోజులు బాలినేని అలకబూనారు. అధిష్టాన పెద్దలు కలుగజేసుకొని ఆయన్ను జగన్ తో మాట్లాడించారు. దీంతో వివాదం సర్దుకుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడకు రెండు నెలల వ్యవధిలోనే తనపై కుట్ర జరుగుతోందని బాలినేని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నెల్లూరులో కాక..
నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తనపై పార్టీలో కుట్ర జరుగుతోందని మీడియాకెక్కారు. అంతటితో ఆగకుండా పార్టీ శ్రేణలకు కొన్ని స్పష్టమైన సంకేతాలు పంపారు. అధికారం ఉంది కదా అని విపక్ష నాయకులపై ఏదిపడితే అది అనవొద్దని, కేసులు పెట్టొద్దని కూడా చెప్పుకొచ్చారు. పార్టీలో తనపై కొందరు సీనియర్లు కుట్ర పన్నుతున్నారని.. రాజకీయంగా డ్యామేజీ చేసే ప్రయత్నం చేస్తున్నారని కోటంరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎవరి పేరు బయటకు చెప్పకున్నా.. ఇండైరెక్టుగా మాత్రం ఆనం రామనారాయరెడ్డిపై ఆరోపణలు చేశారు. ఆయన కుటుంబసభ్యుల వ్యవహార శైలిని ప్రస్తావించి రాజకీయంగా తనను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ డిబేట్ లో మాట్లాడారు. ఏబీఎన్ విషయంలో వైసీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఆ చానల్ డిబేట్లకు వెళ్లొద్దని, ఇంటర్య్యూలు ఇవ్వొద్దని కూడా అధిష్టానం ఆదేశించింది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా కోటంరెడ్డి ఏకంగా తనకు తాను డిబేట్లో పాలుపంచుకున్నారు.
సిక్కోలులో చిత్రాలు..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాజా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణదాస్ తనపై సొంత వాళ్లే కుట్ర చేస్తున్నారని.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఆయన మంత్రివర్గం నుంచి స్థానం కోల్పోగా.. సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు బెర్త్ దక్కింది. దీంతో ధర్మాన కుటుంబంలో రాజకీయ చీలికలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ధర్మాన క్రిష్ణదాస్ ను తప్పించి.. ధర్మాన సోదరుల మేనల్లుడు, సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడుకు టిక్కెట్ వస్తుందంటూ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగంలో కథనాలు రావడంతో క్రిష్ణదాస్ తీవ్ర కలత చెందారు. నాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు తనపై మరో సోదరుడ్ని పోటీలో దించి ఏం పీకగలిగారని పార్టీ ప్లీనరీలో వ్యాఖ్యానించారు. అప్పుడే ఏం చేయలేని వారు ఇప్పుడేం చేస్తారంటూ సవాల్ చేశారు. దీంతో సిక్కోలు వైసీపీలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మొత్తానికి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వైసీపీలో ఇప్పుడు ‘కుట్ర’ కోణాలు బయటకు వస్తుండడం విశేషం.
Also Read: Dissent Leaders In YCP: వైసీపీ నేతల్లోనే అసమ్మతి కుంపట్లా? ఏం జరుగుతోంది?