Congress: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. దేశంలో మూడు స్టేట్లలోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో అధికారాలను పోగొట్టుకుంటోంది. పార్టీ భవిష్యత్ అంధకారంలో పడిపోతోంది. నేతల మధ్య సమన్వయం కొరవడినందున అధికారం క్రమంగా దూరం అవుతోంది. పంజాబ్ పరిణామాలు పార్టీని మరింత దిగజార్చుతున్నాయి. పార్టీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జోక్యంతో పలు విధాలుగా నష్టాల బాట పడుతోంది. ఇప్పటికే నాయకత్వం పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తోంది.

దేశంలో బీజేపీ ప్రభంజనంలో రెండు సార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని తాపత్రయపడుతోంది. దీని కోసం పార్టీని సమూలంగా మార్చాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిపేందుకు కసరత్తు చేస్తోంది. నాయకత్వ లోపంతోనే దేశంలోని పలు ప్రాంతాల్లో అధికారాన్ని వదులుకోవాల్సి వస్తోందని గుర్తించారు. దీంతో ఈ మేరకు పార్టీని గాడిలో పెట్టాలని చూస్తోంది.
పార్టీలో జీ23 సీనియర్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ విధానాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ నష్టాలకు వారే బాధ్యులని నిందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సీడబ్ల్యూసీ సమావేశంలో పలు ప్రాధాన్యత అంశాలపై చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలను రూపుమాపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా కూలంకషంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే దానిపై సమాలోచనలు చేయనున్నారు.
పంజాబ్ లో చోటుచేసుకున్న పరిణామాలతో మిగతా రెండు స్టేట్లలో కూడా అధికార మార్పు కోసం నేతలు పట్టుపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పతనం అయినట్లేననే అనుమానాలు అందరిలో కనిపిస్తున్నాయి. అధికార మార్పిడితోనే పార్టీ భవిష్యత్ ముడిపడి ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని నియమించాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది.