Revanth Reddy: టీకాంగ్రెస్ దూకుడు పెంచింది. 2018 ఎన్నికల తర్వాత దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని స్థితికి చేరుకుంది. ఈ టైంలో పార్టీలో సీనియర్ నాయకులు సైతం గ్రూపు రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఆ పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ అధిష్ఠానం మాత్రం సీనియర్స్‌ను పక్కనపెట్టి రేవంత్ రెడ్డికి పదవి కట్టబెట్టింది. దీంతో అప్పటి నుంచి పార్టీ వ్యవహారాల్లో సీనియర్లు నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారని టాక్. రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టాక దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణ ఇంటి పార్టీ విలీనంపై చర్చనడుస్తుండటంతో ఆ పార్టీని తనలో కలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొదట ఈ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ముందస్తుగానే స్టెప్ తీసుకున్న కాంగ్రెస్.. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌తో ఢిల్లీ వేదికగా చర్చలు జరుపుతోంది. సుధాకర్‌తో పాటు ఆయన సతీమణి లక్ష్మి, కొడుకు సుహాస్‌ను సైతం కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తోంది.
ఇందులో ఏఐసీసీ నేత కొప్పుల రాజు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఇందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సుముఖంగానే ఉందని… రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ సైతం చొరవ తీసుకున్నట్టు టాక్. అన్ని కుదిరితే ఈ నెల 14న నల్లగొండలో భారీ సభ ఏర్పాటు చేసి.. పెద్ద ఎత్తున అనుచరగణంతో చెరుకు సుధాకర్ హస్తం కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. సుధాకర్.. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన వాడు కావడంతో ఆయనకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫాలోయింగ్ ఎక్కువే ఉంది.
Also Read: CM KCR: సెక్రెటేరియట్‌లోనూ కేసీఆర్ మార్క్.. వచ్చే ఏడాది కల్లా నిర్మాణం పూర్తి..
మరోవైపు ఈటల, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్, తీన్మార్ మల్లన్న లాంటి తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్టులు బీజేపీ గూటికి చేరితే.. సుధాకర్ మాత్రం కాంగ్రెస్ వైపు చూశారు. బీజేపీకి చాన్స్ ఇవ్వకుండా రేవంత్ ముందడుగు వేసి ఢిల్లీలో డీల్ కుదర్చినట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందిన చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్‌లో చేరారు. ఇక ఆ ప్లేస్‌ను దక్కించుకోవడానికి సుధాకర్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు టాక్. మరి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? నకిరేకల్ నుంచి పోటీ చేస్తే కోమటిరెడ్డి వర్గం సపోర్ట్ చేస్తుందా? అంటూ కాంగ్రెస్ నేతల్లో డిస్కషన్ జరుగుతోంది.
Also Read: TRS: టీఆర్ఎస్‌కు ఇంత భయమా.. అందుకే క్యాంపు రాజకీయాలు?