UP polls: ఉత్తరప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు తమ ప్రభావం చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన వాదన మొదలు పెట్టింది. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయిస్తామని చెబుతోంది. యూపీలో పార్టీని గాడిలో పెట్టే పనిని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీసుకున్నారు. కాబోయే ముఖ్యమంత్రిగా కూడా ఆమె పేరును ప్రకటించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళలను తమ వైపు తిప్పుకునే క్రమంలో వారి ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తోంది. ఇందుకోసం వారిని కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతిభ ఆధారంగానే టికెట్లు కేటాయించేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే రెండు సార్లు రాష్ర్టంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికార పీఠం చేజిక్కించుకోవాలని చూస్తోంది. దీని కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2022 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని ముందుండి నడిపించాలని ప్రియాంక గాంధీ పలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే కులాల సమీకరణలపై ఓ అంచనా వేస్తున్నారు. బీజేపీ బ్రాహ్మణ ఓట్లు, సమాజ్ వాదీ పార్టీ యాదవుల ఓట్లు, బహుజన సమాజ్ పార్టీ దళితుల ఓట్లను పంచుకుంటున్న నేపథ్యంలో మహిళల ఓట్లు రాబట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతున్నారు. ఎలాగైనా విజయం సాధించాలని తమ వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. యూపీలో జరుగుతున్న పరిణామాలపై పార్టీలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. ఓటు బ్యాంకును కాపాడుకునే క్రమంలో పలు మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్ ను నమ్మిన మైనార్టీలు ప్రస్తుతం దాన్ని విశ్వసించడం లేదు. ఈ నేపథ్యంలో యూపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.