spot_img
Homeజాతీయ వార్తలుRevanth Reddy: రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ల కారాలు మిరియాలు

Revanth Reddy: రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ల కారాలు మిరియాలు

Revanth Reddy: ఏ ముహూర్తాన ఉచిత విద్యుత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారో గాని.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారాలు మిరియాలు దువ్వడం ప్రారంభించారు. మొన్నటి ఖమ్మం సభ దాకా చేతులు పైకి లేపి ఐక్యత ప్రదర్శించిన ఆ నాయకులు ఇప్పుడు మళ్లీ తమకు అలవాటైన కోవర్టు రాజకీయాలకు తెరలేపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తానా మహాసభల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని, ఇలాంటి సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే మొదటికే మోసం వస్తుందని సీనియర్లు చెప్పినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి అన్న మాటలు ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో నిన్న విస్తృతంగా ప్రసారం కావడం..ఇది తమకు అందివచ్చిన అవకాశం గా భావించిన పార్టీ సీనియర్ నాయకులు వెంటనే అలర్ట్ అయిపోయారు. దీంతో ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి చేరవేసినట్టు తెలుస్తోంది.

ఎందుకు అవకాశం ఇస్తున్నారు?

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులైతే నేరుగానే రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదంటూ చురకలు అంటించారు. సీనియర్ నాయకుల జాబితాలో వెంకట్ రెడ్డి మాత్రమే బయటపడ్డారు. మిగతావారు మాత్రం తెర వెనుక చేయాల్సిన పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని ఇక్కడితోనే వారు వదిలేయలేదు.. ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అసలే రేవంత్ రెడ్డి అంటే కోపంతో ఉన్న సీనియర్ నాయకులు అధిష్ఠానికి ఉన్నవి లేనివి కల్పించి మరీ చెప్పారు.. అంతేకాకుండా వారు మీడియాకు లీకులు కూడా ఇచ్చారు. దీంతో మొన్నటిదాకా శక్తివంతంగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎందుకు ఈ అనైక్యత

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరింది నిజం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు ఆయనకు అన్ని యోగ్యతలు ఉన్నాయని తెలిసే రాహుల్ గాంధీ నియమించారు. ఒకవేళ ఇప్పుడున్న సీనియర్ నాయకులకు అంత చరిష్మా గనుక ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఎందుకు తయారవుతుంది. కేసీఆర్ వరుస దెబ్బలు తీస్తున్నా ఎందుకు సైలెంట్ అయిపోతుంది. భారత రాష్ట్ర సమితికి సరైన స్థాయిలో కౌంటర్ ఇచ్చి నిలబడగలిగే సత్తా ఉండి ఉంటే రేవంత్ రెడ్డి అవసరం ఎందుకు వస్తుంది? రేవంత్ రెడ్డి టిడిపి నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు పదవులు ఇచ్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటివారు అంటున్నారు.. సరే అది నిజమే అనుకుందాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దపెద్ద నాయకులు మొత్తం ఒకప్పుడు ఇతర పార్టీలో పని చేసిన వారే కదా! వారికి లేని ఇబ్బంది రేవంత్ రెడ్డి విషయంలోనే ఎందుకు వస్తుందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కే తెలియాలి. ఒకటి మాత్రం సుస్పష్టం. బాల రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఇష్టపడకపోవచ్చు. అతడి ఆధ్వర్యంలో పనిచేయాలంటే ఇబ్బంది అనిపించవచ్చు. ఈ కారణాలే రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచేది. కర్ణాటకలో ఇలాంటి పరిణామాలే ఉన్నప్పటికీ డీకే శివకుమార్ ఒక్కతాటిపైకి తీసుకొచ్చాడు. అదే బాధ్యతను రేవంత్ రెడ్డి భుజాలకు ఎత్తుకున్నాడు. ఇలాంటి సమయంలోనే అతడికి సీనియర్ నాయకులు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే కాంగ్రెస్ పార్టీ మరోసారి కెసిఆర్ చేతిలో చావు దెబ్బ తినాల్సి వస్తుంది. ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ చేతిలో తీవ్రంగా దెబ్బతిన్నది. పరిణామాలను చూసైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మారకపోతే అంతకుమించి చేసేది ఏమీ లేదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version