AP Congress: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల ఎత్తులు మొదలయ్యాయి. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం ఎవరితో కలవాలో ఎవరిని దూరం పెట్టాలనే ఆలోచనలో పార్టీలు పడిపోయాయి. రాష్ట్రంలో జగన్ మరోమారు అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం తమ బలం నిరూపించుకోవాలని భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సైతం పొత్తుల కంటే ఎత్తులకే ప్రాధాన్యం ఇస్తోంది. జగన్ ను ఎదుర్కోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపి జగన్ ను కట్టడి చేయాలని రంగం సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే బీజేపీ, జనసేన పార్టీలు భాగస్వామ్యం కావడంతో టీడీపీ మాత్రం ఒంటరిదైపోయింది. ఈ దశలో కాంగ్రెస్ సైతం జగన్ తో పొత్తు పెట్టుకుంటుందని అనుకున్నా చివరికి పోరుకే సిద్ధమైంది. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేసి జగన్ తో ప్రత్యక్ష పోరాటానికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత సీఎంగా జగన్ ను నియమించేందుకు కాంగ్రెస్ ససేమిరా అంది. దీంతో కలత చెందిన జగన్ తానే పార్టీ పెట్టాలనే ఆలోచనతో వైసీపీకి అంకురార్పణ చేశారు. కానీ విజయం అంత తొందరగా రాదు కదా. దానికి కొంత కాలం ఆగాల్సి వచ్చింది.
Also Read: Jagan vs Pawan kalyan: జగన్ వీక్ నెస్ పై కొట్టిన పవన్ కళ్యాణ్
కాంగ్రెస్ పార్టీ కక్ష గట్టి కేసుల్లో ఇరికించి జైలు పాలు చేసింది. అయినా జగన్ నిరాశ చెందలేదు. తన పోరాటం కొనసాగించారు. చివరకు 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి తిరుగులేని పార్టీగా అవతరించారు. ఇక అప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో పట్టు సాధించేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ తరుణంలో తొలిసారి సీఎం అయిన జగన్ ను ఎలాగైనా ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రణాళికలు రచిస్తోంది.
2009 ఎన్నికల్లోనే జగన్ రాజకీయంగా అరంగేట్రం చేసి ఎంపీగా గెలిచినా ఆయనను సీఎంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిరాకరించింది. ఎమ్మెల్యేలు అందరు సమ్మతించినా పార్టీ వినలేదు. దీంతో జగన్ లో ఆగ్రహం పెరిగింది. ఎలాగైనా అధికారం చేపట్టాలని భావించి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. తన తండ్రి లాగే తనకు కూడా ఓ సారి అవకాశం ఇవ్వాలని కోరారు.
వైఎస్ మరణం తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జగన్ వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. దీంతో ఆయనలో సీఎం కావాలనే కాంక్ష ఎక్కువైంది. 2014 నాటికి జగన్ జైలు నుంచి బయటకు వచ్చినా కాంగ్రెస్ తో విభేదాలు పెరిగాయి తప్ప తగ్గలేదు దీంతో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలనే తపన మాత్రమే పెరిగిదని తెలుస్తోంది.
2014లో కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకుని ఓడిపోయాక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి జగన్ కు పోటీగా దించాలని ఆలోచిస్తోంది. దీనికి గాను పక్కా ప్రణాళిక కూడా రచిస్తోంది. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఢీకొనేందుకు ఒంటరిగానే ముందుకు వెళ్తున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ తో పొత్తు కంటే పోరు కొనసాగించేందుకే నిర్ణయించుకుంది కాంగ్రెస్. అందుకే కిరణ్ కుమార్ రెడ్డిని ఆయుధంగా చేసుకుని పోరాటం చేసేందుకు ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఇక కాంగ్రెస్ ఎత్తులు ఎంతవరకు పని చేస్తాయో తెలియడం లేదు. మొత్తానికి రాష్ట్రంలో చతుర్ముఖ పోరు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకపక్క బీజేపీ, జనసేన, మరోవైపు టీడీపీ, ఇంకో వైపు జగన్, కాంగ్రెస్ పార్టీలు సమరానికి సై అంటున్నాయని తెలుస్తోంది.
ఇక మారుతున్న రాజకీయాల నేపథ్యంలో ఏపీలో ఏ పార్టీ అధికారం చేపడుతుందో తెలియడం లేదు. మొత్తానికి రాజకీయ ముఖచిత్రం మాత్రం మారిపోతోంది. జగన్ తో పొత్తు పెట్టుకోవాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచించిన నేపథ్యంలో ఆయన సూచనలు సైతం పట్టించుకోకుండా జగన్ తో పోరుబాటకే తెగిస్తున్నట్లు చెబుతున్నారు.
Recommended Videos: