CM YS Jagan: వైసీపీలో సీఎం జగన్ మాటకు తిరుగులేదు. ఆయన ఆదేశాలే ఫైనల్. పేరుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కానీ అందరూ నిమిత్తమాత్రులే. నిన్న మొన్నటి వరకూ వినిపించిన మాటలివి. కానీ ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు తలకిందులైనట్టు తెలుస్తోంది. అధినేత మాటకు వైసీపీ ప్రజాప్రతినిధులు ససేమిరా అంటున్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి డుమ్మా కొడుతున్నారు. తాజాగా రైతు భరోసా తొలి వాయిదా చెల్లింపు కార్యక్రమాలకు చాలా మంది ముఖం చాటేశారు. సంక్షేమ పథకాల అమల్లో తమ ప్రమేయం ఏ మాత్రం లేకపోవడం.. గ్రామ/వార్డు వలంటీరుకున్న గౌరవం కూడా తమకు లేకపోవడం దీనికి కారణమన్న అభిప్రాయం వినవస్తోంది. మరోవైపు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు, నిలదీతలు కూడా ప్రజాప్రతినిధులు ముఖం చాటేయ్యడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
గడపగడపకు వైసీపీ ప్రభుత్వంలో భాగంగా గ్రామాలను సందర్శిస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులను రోడ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు తదితర సమస్యలపై జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రజాప్రతినిధులు డుమ్మా కొడుతుండడంతో వారిలో జగన్‌పై భయభక్తులు సన్నగిల్లాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఉగాది (ఏప్రిల్ 2) నుంచి గడప గడపకూ తీసుకు వెళ్లాలని బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ ఏడాది మార్చి 15వ తేదీన నిర్వహించిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం ఆదేశించారు. అయితే.. ఆ రోజు కాదని.. ఏప్రిల్ పదో తేదీ నుంచి చేపడతామని పలువురు ప్రజాప్రతినిధులు చెప్పారు. వారి విముఖతను గమనించిన ప్రభుత్వ పెద్దలు.. ప్రచార సామగ్రి రాలేదన్న నెపంతో వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈ నెలలో ఎట్టకేలకు చేపట్టినా.. తూతూ మంత్రంగానే కొనసాగుతోంది.
Also Read: AP Congress: జగన్ తో పోరాటానికే సై అంటున్న కాంగ్రెస్?
ఆలకించే వారేరీ?
వైసీపీలో జగన్ మాట శాసనమైనా ఇప్పుడు ఆలకించేవారే కరువయ్యారు. గడప గడపకూ వెళ్లి ప్రజాదరణ పొందితే తప్ప మళ్లీ అధికారంలోనికి రాలేమని.. ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు కాలేరని ఆయన హెచ్చరిస్తున్నా… వారు పట్టించుకోవడం లేదు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ నాటి నుంచే పార్టీలో క్రమశిక్షణ కట్టు తప్పినట్టు కకనిపిస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తొలిసారి మంత్రివర్గ విస్తరణ చేసిన సమయంలో.. రెండున్నరేళ్ల తర్వాత వారిలో 90 శాతం మందిని తొలగించి కొత్తవారికి అవకాశమిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. దాంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ గత నెలలో జరిగిన పునర్వ్యవస్థీకరణలో 11 మంది పాతవారినే కొనసాగించడంతో.. కొత్తగా 14 మందికే అవకాశం దక్కింది. దీంతో అసంతృప్తి జ్వాలలు రేగాయి. సీఎం స్వయంగా జోక్యం చేసుకుని అసంతుష్టులను బుజ్జగించారు. 2024 ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా మంత్రి పదవులిస్తానని వారికి మాటిచ్చారు. తీరాచూస్తే ఆ హామీలు కేబినెట్ పరిమితిని దాటేశాయి. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఎమ్మెల్యేలు గుర్రుగానే ఉన్నారు. దీనికితోడు నియోజకవర్గాల్లో తమ మాట చెల్లడం లేదన్న అసంతృప్తి వారిలో ఉంది. గతంలో నియోజకవర్గంలో ఏ చిన్న పని ఉన్నా జనం ఎమ్మెల్యే వద్దకు వెళ్లేవారు.
ఇప్పుడా పరిస్థితి లేదు. ఊళ్లలో పెత్తనమంతా వార్డు/గ్రామ వలంటీర్లదే. సంక్షేమ పథకాలు ఎవరిస్తున్నారని అడిగితే.. ప్రజలు సీఎం జగన్ పేరు చెప్పకుండా వలంటీర్లు ఇస్తున్నారని చెప్పడం వరకు పరిస్థితి వెళ్లింది. వారు ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏ పని పడినా వలంటీరు వద్దకే పోతున్నారు.
జనాగ్రహం తట్టుకోలేక..
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనం ఆగ్రహంతో ఉన్నారు. ఇళ్ల పట్టాల్లో అన్యాయం జరిగిందన్న బాధ, పెన్షన్ల మంజూరులో వివక్ష చూపుతున్నారన్న ఆవేదన కూడా ఉన్నాయి. ఇది గ్రహించే చాలా మంది ఎమ్మెల్యేలు ‘గడప గడపకు’ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. పైగా వెళ్లినవారిని జనం నిలదీస్తుండడంతో.. తర్వాత వెళ్దామనుకున్నవారు కూడా జంకుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజాదరణ పొందాల్సిందేనని.. లేదంటే ఎన్నికల్లో గెలవలేరని.. సర్వేల ఆధారంగానే 2024లో టికెట్లు ఇస్తానని.. ఓడిపోయేవారికి ఇచ్చే ప్రసక్తే లేదని జగన్ పదే పదే హెచ్చరిస్తున్నా.. వారు పట్టించుకోవడంలేదు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం-2022 తొలి విడత నగదు బదిలీ కార్యక్రమం సోమవారం జరిగింది. జగన్ ఏలూరులో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని మం త్రులు, ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు. అయితే వారెవరూ సీరియ్‌సగా తీసుకోలేదు. చాలా మంది డుమ్మా కొట్టారు. లబ్ధిదారుల ఎంపికలో తమ మాటకు విలువ లేనప్పుడు పాల్గొని ప్రయోజనం ఏమిటని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.
Also Read:Gautam Adani: రాజ్యసభ ఆశావహుల నుంచి అదానీ ఔట్… ఆ స్థానం ఎవరికిస్తారంటే?