
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. పార్టీకి సరైన నాయకుడు లేకనా..? లేక అధికార పార్టీ ఆకర్షణా తెలియదు గానీ రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకులు వేరే పార్టీల వైపే చూస్తున్నారు. రెండు చోట్ల పార్టీ పటిష్టతకు అధిష్టానం ఏ రకంగా కృషి చేస్తున్నా అవి సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో రాను రాను పార్టీ పూర్తిగా దెబ్బతినే అవకాశం లేకపోలేదని పార్టీలోని సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పెట్టే ఆకర్స్ పథకానికి ఇప్పటికే కాంగ్రెస్‌లోని నాయకులంతా గులాబీ కండువా కప్పుకున్నారు. అధినేత కేసీఆర్ చాతుర్యంతో పెద్ద పెద్ద లీడర్లంతా టీఆర్‌ఎస్‌లోకి చొరబడుతున్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒకప్పుడు పెద్ద దిక్కు అయిన దానం నాగేందర్ సహా చాలా మంది కారెక్కేశారు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన దానం ఆ తరువాత ఓడిపోవడంతో ఈసారైనా ఆ లోటును పూడ్చాలని టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర్ రాజనర్సింహ కూడా పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తారన్న ప్రచారం సాగుతోంది. ఆయన కాంగ్రెస్ లో యాక్టివ్ గా లేరు. ఇక పాతబస్తీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా టీఆర్‌ఎస్ జెండా పట్టుకునే యోచనలో ఉన్నారట..
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ ఇంతకంటే గడ్డుకాలన్నే ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వీలు కాకపోతే వైసీపీలోనైనా వెళ్లేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నారు. కాగా ఇటీవల కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ గా శైలజానాథ్ ఎంపికయ్యాడు. ఆయన మళ్లీ మాజీ సీఎం కిరణ్ సహా దిగ్గజ కాంగ్రెస్ నేతలు మళ్లీ తీసుకొస్తానని హామీ ఇచ్చాడట. అయితే ఆ పనిలో ఉండగా ఎవరూ పార్టీ వైపు చూడడం లేదట. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో సెంట్రల్లో ఈసారి అధికారంలోకి కాంగ్రెస్ వస్తే అప్పుడు చూద్దామంటూ వెళ్తున్నారట.
ఏదీ ఏమైనా ఇప్పటి నుంచైనా పార్టీ నాయకులను కాపాడుకోలేకపోతే కాంగ్రెస్ మరి కొన్ని రోజుల్లో చివరిపార్టీగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.