హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయంగా సంచలనాలు సృష్టిస్తోంది. పార్టీలు తమ ప్రభావాన్ని చూపించేందుకు వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో ప్రచారంపైనే దృష్టి సారించాయి. కానీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ప్రకటనపై కాస్త ఆలోచనలో పడింది. దీటైన అభ్యర్థి కోసం ఇన్నాళ్లు వేచి చూసింది. ఎట్టకేలకు సమ ఉజ్జీ అయిన అభ్యర్థినే గుర్తించింది.
మొదటి నుంచి పార్టీ ఆలోచించినట్లుగానే కొండా సురేఖ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె అయితేనే పోటీ రసవత్తరంగా మారుతోందన్న ఉద్దేశంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్టుబట్టి మరీ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు పావులు కదువుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక త్రిముఖ పోరులా కొనసాగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొండా సురేఖ ఒక దశలో పార్టీని వీడాలని భావించినా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ భవిష్యత్ పై ఆశలతో పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సైతం సురేఖకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పించాలని ప్రయత్నించినా అధిష్టానం ఒప్పుకోలేదు. అయినా వారు నిరాశ పడలేదు. పార్టీ నాయకత్వంపై నమ్మకంతో సురేఖ పార్టీలో కొనసాగాలని భావించారు.
కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన సురేఖ కొద్ది రోజులుగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలని చూసినట్లు తెలుస్తోంది. సురేఖ కంటే ముందు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ పేర్లు పరిశీలించినా చివరికి సురేఖ పేరుకే ప్రాధాన్యం కల్పించారు. ఈనెల 18న అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కూడా జోరు పెరుగుతుందని కార్యకర్తలు ఆశిస్తున్నారు. ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయాలనే శాసిస్తోంది. పార్టీల మనుగడపై పెను ప్రభావం చూపే అవకాశం ఏర్పడింది.
ఇప్పటికే అధికార పార్టీ దళితబంధు పథకంతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. ఇక ఈటల సైతం సానుభూతి ఓట్లతో నెగ్గాలని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఏ మంత్రం వల్లెవేస్తుందో చూడాలి. కార్యకర్తల ఆశలకనుగుణంగా పార్టీ కార్యక్రమాలను ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పావులు కదుపుతుున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నిక పార్టీల్లో ఏం ప్రకంపనలు సృష్టించనుందో వేచి చూడాల్సిందే.