KVP Ramachandra Rao: వైఎస్ఆర్ వర్థంతి నేడు. తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు.. కాంగ్రెస్ వాదులు ఘననివాళులు అర్పిస్తున్నాడు. ఇడుపుల పాయలో జగన్, షర్మిల, విజయమ్మ నివాళులర్పించగా.. హైదరాబాద్, ఏపీలో కాంగ్రెస్ నేతలు వైఎస్ ను తలుచుకుంటున్నారు. వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ తలపెట్టిన వైఎస్ ఆత్మీయ సమ్మేళనం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వైఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావాలని వైఎస్ విజయమ్మ నాటి వైఎస్ఆర్ మిత్రులు, శ్రేయోభిలాషులు, వైఎస్ఆర్ కేబినెట్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలకు వర్తమానం పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కు ఆత్మగా వ్యవహరించిన ఆయన దగ్గరి స్నేహితుడు కేవీపీ రాంచంద్రరావు సైతం ఈ సమ్మేళనానికి హాజరు కానున్నారనే వార్త వైరల్ అయ్యింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ గాంధీ భవన్ లో కొంచెం సేపటి క్రితం మీడియాతో కేవీపీ మాట్లాడారు. వైఎస్ఆర్ అందరికీ కావాల్సిన వ్యక్తి అని పేర్కొన్నాడు. ‘నాకు విజయమ్మ ఫోన్ చేసి ఆత్మీయ సమ్మేళనం గురించి ఆహ్వానించారని.. ఆత్మీయ సమ్మేళనానికి నేను కూడా వెళుతున్నా’ అని పేర్కొన్నాడు.
ఈ సాయంత్రం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్ లో ‘వైఎస్ ఆత్మీయ సమ్మేళం’ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ తో కలిసి పనిచేసిన అందరికీ విజయమ్మ ఆహ్వానాలు పంపారు. అయితే ఈ సంస్మరణ సభకు ఎవరెవరు హాజరు అవుతారు? ఎవరు డుమ్మా కొడుతారన్న దానిపైనే సస్పెన్స్ నెలకొంది.
వైఎస్ విజయమ్మ కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేసిన కొత్త పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకే ఈ సంస్మరణ సభను పెట్టారన్న వాదన వినిపిస్తోంది. దీనివెనుక ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త ఉన్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సభకు ఎవరు వస్తారు? ఎవరు రారు? అన్నది ఆసక్తి రేపుతోంది.