మొదటి భాగంలో కాంగ్రెస్ ఏవిధంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని సామాజిక వర్గాల్లో స్వీయ ధ్వంస రచన చేసుకుందో చూసాము. కాంగ్రెస్ అభిమానులకు కాంగ్రెస్ పతనం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇదేదో బిజెపినో,మోడీనో చేసింది కాదు. స్వయం కృతాపరాధం. పార్టీని చలనశీలంగా తయారుకానివ్వకుండా,కుటుంబ ఆధిపత్యానికి ఎక్కడ దెబ్బతగులుతుందోననే అభద్రతా భావంతో వందిమాగధులతో నింపి,కిందస్థాయి కార్యకర్తల మనోభావాలను విస్మరించి పార్టీని నడపటంతో ఈ దుస్థితి దాపురించింది. చివరకు ఇప్పుడు దాని మిత్రపక్షాలు కూడా తమతో పొత్తు కట్టటంపై పునరాలోచించుకోవలసిన పరిస్థితులు వచ్చాయంటే ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటుందా లేక ఎప్పటిలాగా దాటవేస్తుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఇప్పటివరకు లోతైన చింతన జరగలేదు. అటువంటప్పుడు ఇప్పుడుమాత్రం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి?
మిత్రపక్షాల కూటమిలో బలహీన లింక్ కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ వాస్తవాలకి భిన్నంగా మిత్రపక్షాలతో బేరసారాలు జరుపుతుంది. అదేమంటే మాది ఘన చరిత్ర గలిగిన పార్టీ,మా తాతలు నేతులు తాగారు మా మూతులు చూడండి అనే పంధాలో,అది కుదరకపోతే డిల్లీలో మీకు మేము తప్పితే గతిలేదు,అక్కడ మా అవసరం మీకు చాలావుంది అనే ధోరణిలో ప్రవర్తిస్తూ భయపెట్టి,బ్లాక్ మెయిల్ చేసి బలానికి మించి మిత్రపక్షాలనుంచి సీట్లు గుంజుకోవటం పరిపాటి అయ్యింది. అదే ఇవ్వాళ కాంగ్రెస్ పాలిట శాపం అయ్యింది. బీహార్ ఎన్నిక తర్వాత మిత్రపక్షాలు కాంగ్రెస్ ప్రవర్తనని సమీక్ష చేసుకోవటం మొదలుపెట్టాయి. వాళ్ళ అనుమానాలకు కారణం లేకపోలేదు. గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వాళ్ళ పనితీరుని ఒక్కసారి పరిశీలిస్తే అర్ధమవుతుంది వీళ్ళ నిర్వాకం.
Also Read: దయనీయమైన స్థితిలో కాంగ్రెస్ (మొదటి భాగం)
2016 లో తమిళనాడులో డిఎంకె కూటమిలో జూనియర్ పార్టనర్ గా చేరింది. పైన చెప్పిన పద్ధతిలో బలానికి మించి పోటీ చేసే సీట్లు సంపాదించింది. చివరకు పోటీచేసిన 41 సీట్లకు గాను కేవలం 8 సీట్లే గెలిచింది. అంటే స్ట్రైక్ రేట్ 19.5 శాతం అన్నమాట. 2017 లో ఉత్తరప్రదేశ్ లో సమాజవాది పార్టీ కూటమిలో జూనియర్ పార్టనర్ గా చేరి ఏకంగా 114 సీట్లు పోటీ చేసి కేవలం 7 సీట్లు గెలిచింది. కేవలం 6 శాతం స్ట్రైక్ రేట్ ని సాధించింది. 2019 లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సిపి తో జతగట్టి ఏకంగా 147 స్థానాల్లో పోటీచేసి 30 శాతం స్ట్రైక్ రేట్ తో కేవలం 44 సీట్లు మాత్రమే గెలిచింది. ఇంకో ముఖ్యవిషయమేమంటే ఇన్ని సీట్లు పోటీచేసి చివరకు ఎన్నికల్లో తూతూ మంత్రంగా ప్రచారం చేస్తే శరద్ పవార్ భుజాన వేసుకొని కనీసం ఈ సీట్లయినా గెలిచేటట్లు చేసాడు. అదే ఇప్పుడు బీహార్ లో తేజస్వి యాదవ్ కూటమిలో జూనియర్ పార్టనర్ గా చేరి బలానికి మించి బెదిరించి సీట్లు గుంజుకొని తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాకుండా చేసింది. కాంగ్రెస్ ని సంతృప్తి పరచటానికి కూటమిలోని రెండు పార్టీలను బయటకు పంపించాల్సి వచ్చింది. అదే ఇప్పుడు తేజస్వి యాదవ్ కొంపముంచింది. ఇంతకీ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 70 సీట్లకు పోటీ చేసి కేవలం 27 శాతం స్ట్రైక్ రేట్ తో 19 సీట్లు గెలిచింది. ఈ అన్నిఎన్నికల్లో కామన్ ఫాక్టర్ ఏమిటంటే కూటమిలోని మిగతా పక్షాలతో పోలిస్తే కాంగ్రెస్ పనితీరు అధ్వానంగా వుండటం. అంటే అర్ధమేమిటి? బలంతో సంబంధం లేకుండా ఎక్కువసీట్లు తీసుకొని కూటమిని బలహీన పరచిందని. ఒక్క ఝార్ఖండ్ లోనే తన స్ట్రైక్ రేట్ పర్వాలేదనిపించింది.
ఈ నేపధ్యంలో వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్,అస్సాం,తమిళనాడు,కేరళ,పుదుచ్చేరిల ఎన్నికల్లో మిత్రపక్షాలతో ఒప్పందం కుదుర్చుకోబోతుంది. పశ్చిమ బెంగాల్ లో సిపిఎం ఆధ్వర్యాన వామపక్షకూటమితో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టింది. ఇక్కడ ప్రస్తుతం దొందూ దొందే కాబట్టి సీట్ల పంపకంలో పెద్ద సమస్య తలెత్తకపోవచ్చు. అస్సాంలో మొట్టమొదటిసారి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి స్థిరపడిన ముస్లిం పార్టీతో ఒప్పందం చేసుకోబోతుంది. 1985 లో ఆసు-రాజీవ్ గాంధీ ఒప్పందం వలసదారులకి వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడు భూమి గుండ్రంగా వుందని రుజువయ్యింది. ఎవరికి వ్యతిరేకంగా ఇన్నాళ్ళు మాట్లాడారో వాళ్ళతోనే ఒప్పందం చేసుకుంది. దీనిని అస్సాం ప్రజలు ఏవిధంగా స్వీకరిస్తారో చూడాలి. తమిళనాడులో ఈసారి సీట్లదగ్గర డిఎంకె కాంగ్రెస్ తో గట్టిగా వుండే అవకాశం వుంది. కేరళలో సీట్ల పంపకం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే అందులోని పార్టీలు ఎవరి బేస్ లో వాళ్ళు పోటీ చేస్తుంటారు కాబట్టి. మరి ఫలితం ఎప్పటిలాగా రిపీట్ అవుతుందా లేక మెరుగవుతుందా అనేది వేచి చూడాలి.
సంక్షోభంలో కాంగ్రెస్
అ) సైద్ధాంతిక గందరగోళం: అసలు పార్టీకి దిశా దశ లేకుండా పోయింది. ఉదాహరణకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సాఫ్ట్ హిందుత్వ పంధాని ఎంచుకుంది. రాహుల్ గాంధీ స్వయంగా నేను జన్యుధారి బ్రాహ్మణుడను అని ప్రకటించుకొని గుజరాత్ లోని గుళ్ళ చుట్టూ తిరిగాడు. అదేమీ ఫలితం ఇవ్వలేదు. అదేసమయంలో ఢిల్లీ జేఎన్ యు విశ్వవిద్యాలయంలో ఇస్లామ్ తీవ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులకు మద్దత్తుగా మాట్లాడి అప్రతిష్ట పాలయ్యాడు. అస్సాంలో వచ్చే ఎన్నికల్లో ఇస్లాం మతవాద పార్టీ అయిన బద్రుద్దీన్ నాయకత్వంలోని యు డి ఎఫ్ తో సూత్రబద్ధ పొత్తుకి ఒప్పుకోవటం వివాదానికి దారితీసింది. బద్రుద్దీన్ తో పొత్తు, ఒవైసీతో వైరం ఏ కోణంలో చూడాలి? బద్రుద్దీన్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒవైసీతో వైరమెందుకని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి మతవాద పార్టీలతో పొత్తు పెట్టుకుంటే సెక్యులరిజం ఏమైనట్లు? ఇక జమ్మూ-కాశ్మీర్ లో పార్టీ వైఖరి మరింత వివాదానికి దారితీసింది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం అవసరమయితే చైనా సాయం కోరతామని ప్రకటించిన ఫరూక్ అబ్దుల్లా, జమ్మూ-కాశ్మీర్ జెండా లేకపోతే భారత జాతీయ జెండా పట్టుకోనని చెప్పిన మహబూబా ముఫ్తీతోను కలిసి ప్రయాణం చేయటాన్ని దేశంలోని మిగతా కాంగ్రెస్ వాదులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇలా కాంగ్రెస్ సైద్ధాంతిక గందరగోళంలో కూరుకుపోయింది. ఒక జాతీయ పార్టీకి ఉండాల్సిన స్పష్టత దేశ సమస్యలపై లేకపోవటం మొట్టమొదటి సంక్షోభం.
Also Read: బీహార్ ఎఫెక్ట్.. కాంగ్రెస్ కు ప్రాంతీయ పార్టీలు దూరం!
ఆ) నాయకత్వ లోపం: 2019 లోక్ సభ ఎన్నికల ఓటమి తర్వాత ఇంతవరకు పార్టీకి అధ్యక్షుడు లేకపోవటం శోచనీయం. రాహుల్ గాంధీ నేను ఉండను బాబో అని తప్పుకున్నా నువ్వే వుండాలని లేకపోతే అసలు అధ్యక్షుడు లేకపోయినా పర్వాలేదనుకొనే ధోరణిలో కాంగ్రెస్ నాయకులు వున్నారంటే వీళ్ళ మానసిక దౌర్బల్యాన్ని ఏమనాలి? రాహుల్ గాంధీ ఏమైనా జవహర్లాల్ నెహ్రూ నా లేక ఇందిరా గాంధీ నా. వాళ్ళకున్న ప్రతిభలో నూరోవంతైనా ఈ ‘పప్పు’ కి ( క్షమించాలి ఈ ఊతపదం సాంఘిక మీడియాలో ప్రాచుర్యం పొందింది) వుంటే సరిపెట్టుకోవచ్చు. ప్రతిభ లేకుండా కేవలం ఆ కుటుంబంలో పుట్టాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్వంత ఆస్తి అనుకుంటే ఎలా? ఇటీవల ట్విట్టర్ లో నేనయితే 15 నిముషాల్లో చైనాని దెబ్బ తీసేవాడిని అని చెప్పటం తన అపరిపక్వతకు నిదర్శనం. సోనియా గాంధీ నెహ్రూ కుటుంబంలోకి ప్రవేశించిన తర్వాత ఆర్ధిక అవకతవకలు జరిగినట్లు అనేక ఆరోపణలు కుటుంబంపై వచ్చాయి. ఖత్రోచిని దేశంనుంచి బయటకు పంపించినది మొదలు నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కాజేయాలని చూసిన దాకా, జాకీర్ నాయక్ దగ్గరనుంచి మేహెల్ చొక్సి విరాళాల దాకా అనేక రకాల ఆరోపణలు సోనియా గాంధీపై వచ్చాయి. నాయకత్వ లక్షణాలు లేకపోవటం,అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవటం,అభద్రతా భావంతో మిగతావారిని పైకి రానీయకపోవటం, జటిలమైన సమస్యలను పరిష్కరించలేని అసమర్ధ నాయకత్వం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి దారితీసాయి.
ఇ) సంస్థాగత పునర్నిర్మాణం : లోపాల పుట్టతో కూడిన ప్రస్తుత సంస్థను దరిచేర్చాలంటే సంస్థాగత పునర్నిర్మాణం చేపట్టాలి. కింద స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించాలి. దీనిపై 23 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాసిన లేఖలో పలు సూచనలు చేయటం జరిగింది. అది సమగ్రం కాకపోయినా వాటిని అమలుచేసినా కాంగ్రెస్ పార్టీ కొంత వరకు బతికి బట్ట కట్టగలుగుతుంది. దురదృష్టవశాత్తు పార్టీ అధినాయకత్వం ఆ లేఖ రాసిన వారి విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తదనంతర పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాతయినా కళ్ళు తెరచి ఆత్మ విమర్శ చేసుకొని సంస్థాగత పునర్నిర్మాణానికి పూనుకోవాలి. అంతర్గత ప్రజాస్వామ్యం,యువతకు పెద్దపీట,కిందస్థాయి కార్యకర్తలకు గుర్తింపు,ఎన్నికైన వర్కింగ్ కమిటీ,నాయకత్వ లక్షణాలు,సామర్ధ్యంగల అధ్యక్షుడు పార్టీని తిరిగి పట్టాల మీద పెట్టగలవు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయం
ఈ సంస్థాగత పునర్నిర్మాణంతో సైద్ధాంతిక పునః సమీక్ష చేసుకొని ముందుకు సాగితే కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు వున్నాయి. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయపార్టీ అవసరం ఎంతయినా వుంది. ప్రస్తుతం బిజెపి ఒక్కటే జాతీయ పార్టీగా వుంది. మిగతావి నామమాత్రపు జాతీయ పార్టీలే. ప్రజాస్వామ్యానికి ఈ స్థితి మంచిది కాదు. కనీసం రెండో ప్రత్యామ్నాయమైనా వుండాలి. అదీ ఓ ఉదారవాద,మధ్యేవాద పార్టీ అయితే మరీ మంచిది. ఎందుకంటే సంప్రదాయవాద పార్టీగా బిజెపి ఉండనే వుంది. ఆ లోటు పూడ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వుంది. కావలసినదల్లా పార్టీపై చిత్తశుద్ది. దేశంలో ఈనాటికి కాంగ్రెస్ ని అభిమానించే జనం గణనీయంగా వున్నారు. వారి ఆశలను అందిపుచ్చుకొనే నేతలు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మిస్తారని ఆశిద్దాం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Congress in pitiable situation part2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com