కాంగ్రెస్ లో భ‌స్మాసురులు.. నెత్తిన‌ ఎవ‌రో చేయి పెట్టాల్సిన ప‌నిలేదు!

కేంద్రంలో ఇప్ప‌టికే రెండు సార్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌.. కోలుకోవ‌డానికి నానా అవ‌స్థ‌లు పడుతోంది. మ‌ళ్లీ తిరిగి లేవొద్దు అన్న విధంగా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించి, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరిగి జెండా పాతాల‌ని హైకమాండ్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల్లో క‌లిసిక‌ట్టుగా ఉండాల్సిన కాంగ్రెస్ నేత‌లు.. సిగ‌ప‌ట్లు పడుతున్నారు. ఎవ‌రి లాభం వాళ్లు చూసుకుంటూ.. కాంగ్రెస్ జెండాను పీలిక‌లు చేసేందుకు సైతం వెనుకాడ‌ట్లేదు. దేశంలో అతి త‌క్కువ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాల‌న […]

Written By: Bhaskar, Updated On : August 26, 2021 1:30 pm
Follow us on

కేంద్రంలో ఇప్ప‌టికే రెండు సార్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌.. కోలుకోవ‌డానికి నానా అవ‌స్థ‌లు పడుతోంది. మ‌ళ్లీ తిరిగి లేవొద్దు అన్న విధంగా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించి, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరిగి జెండా పాతాల‌ని హైకమాండ్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల్లో క‌లిసిక‌ట్టుగా ఉండాల్సిన కాంగ్రెస్ నేత‌లు.. సిగ‌ప‌ట్లు పడుతున్నారు. ఎవ‌రి లాభం వాళ్లు చూసుకుంటూ.. కాంగ్రెస్ జెండాను పీలిక‌లు చేసేందుకు సైతం వెనుకాడ‌ట్లేదు.

దేశంలో అతి త‌క్కువ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాల‌న కొన‌సాగుతోంది. వీటిని కూడా ఎలా లాగేసుకోవాలా అని బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంటే.. కాంగ్రెస్ నేత‌లే ఆ ప‌నిచేసేలా క‌నిపిస్తున్నారు. గ్రూపు త‌గాదాలు పెట్టుకుంటూ పార్టీ ప‌రువును ర‌చ్చ‌కీడుస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు హైక‌మాండ్ కు ఫిర్యాదులు చేసుకుంటూ.. బ‌హిరంగంగానే తిట్టిపోసుకుంటున్నారు. ప్ర‌స్తుతం పంజాబ్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల్లో నెల‌కొన్న ప‌రిస్థితి అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అక్క‌డ ఒక‌రిపై ఒక‌రు బ‌హిరంగ యుద్ధ‌మే చేస్తున్నారు.

పంజాబ్ లో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింద‌ని భావించిన‌ప్ప‌టికీ.. మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. సిద్ధూకు పీసీసీ చీఫ్ ఇవ్వ‌డాన్ని సీఎం అమ‌రీంద‌ర్ వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకించింది. పీసీసీ చీఫ్ ప్ర‌క‌టించిన త‌ర్వాత కొన్ని రోజుల వ‌ర‌కు సిద్ధూకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి తేనేటి విందులో పాల్గొన‌డంతో స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగింద‌ని అంతా అనుకున్నారు. కానీ.. ప‌రిస్థితి మారిపోయింది.

కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి ఏమంటే.. 80 ఏళ్ల అమ‌రీంద‌ర్ సింగ్ ను సీఎం పీఠం నుంచి దించేయాల‌ని రెబ‌ల్ వ‌ర్గం ప‌ట్టుబ‌డుతోంది. ఇందులో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. లేక‌పోతే.. స‌మ‌ర‌మే అని సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. కానీ.. అధిష్టానం దీన్ని అంగీక‌రించ‌ట్లేదు. వ‌చ్చే ఏడాది జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లకు ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ నేతృత్వంలోనే కాంగ్రెస్ వెళ్తుంద‌ని పంజాబ్‌ రాష్ట్ర ఇన్ ఛార్జ్ హ‌రీష్ రావ‌త్ స్ప‌ష్టం చేశారు. రెబ‌ల్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని పీసీసీ చీఫ్‌ సిద్ధూ హామీ ఇచ్చార‌ని, పార్టీ లైన్ దాటితే ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు. దీంతో.. ఈ గోల ఎటు దారితీస్తుందోన‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు జ‌రుగుతున్న ప‌రిణామంతో.. కాంగ్రెస్ అధికారం నిల‌బెట్టుకుంటుందా? అన్న‌ది సందేహంగా మారింది.

అటు ఛ‌త్తీస్ గ‌ఢ్ లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్య‌మంత్రి భూపేష్‌ బాఘ‌ల్‌.. సీనియ‌ర్ నేత‌, మంత్రి టీఎస్ సింగ్ డియో మ‌ధ్య గ‌డ్డివేయ‌కున్నా భ‌గ్గు మంటోంది. ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చెరో రెండున్న‌రేళ్లు పంచుతామ‌ని త‌న‌కు హామీ ఇచ్చార‌ని, ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నార‌న్న‌ది టీఎస్ సింగ్ వాద‌న‌. ఈ పంచాయ‌తీ ఢిల్లీకి చేరింది. ఇదే విష‌య‌మై రెండు రోజుల క్రితం వీరిద్ద‌రితో వేర్వేరుగా రాహుల్ భేటీ అయ్యారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అధిష్టానం చెప్పిన‌ట్టు చేస్తాన‌ని సీఎం భూపేష్ అన్నారు. అయితే.. ఇత‌రులు సీఎం కుర్చీలో కూర్చుంటే విజ‌యవంతం కాలేర‌ని ప‌రోక్షంగా సింగ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ విధంగా.. వీరిద్ద‌రి మ‌ధ్య పంచాయతీ ముదురుపాకాన ప‌డింది.

అస‌లే.. దేశంలో అధికారానికి దూర‌మ‌య్యామ‌ని మ‌ద‌న ప‌డుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఈ చిక్కులు మ‌రింత త‌ల‌నొప్పులు తెచ్చి పెడుతున్నాయి. అటు రాజ‌స్థాన్ లోనూ సీఎం అశోక్ గెహ్లాట్‌-స‌చిన్ పైలెట్ వ‌ర్గాల మ‌ధ్య పంచాయతీ ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. వ‌చ్చేసారి ఎలాగైనా అధికారం సాధించాల‌ని ఆశిస్తున్న హైక‌మాండ్ కు ఈ స‌మ‌స్య‌లు మింగుడు ప‌డ‌ట్లేదు. మ‌రి, వీటిని ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.