Congress Meating: తెలంగాణలోని ప్రజలను కలవరపెడుతున్న రెండు ప్రధాన సమస్యలపై పోరుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని ఇతర ప్రతిపక్షాలతో కలిసి ఈ పోరాటానికి సిద్ధమైంది. తాజాగా గాంధీ భవన్ లో అఖిలపక్ష భేటీని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షత వహించగా.. సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి , టీజేఎస్ నుంచి ప్రొ. విశ్వేశ్వరరావ్ ,ఇంటిపార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, న్యూ డెమోక్రసీ, టీటీడీపీ, లిబరేషన్ ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు.
ఈ మీటింగ్ అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టే విద్యార్ది ,నిరుద్యోగ ఉధ్యమానికి మద్దతు ఇవ్వాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క కోరారు. మాతో కలసివచ్చే పార్టీ లను స్వాగతించి ఉద్యమిస్తామన్నారు. దీనికి సూత్రప్రాయంగా మీటింగ్ లో పాల్గొన్న అన్ని పక్షాలు మద్దతు తెలిపాయి.
తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్న పోడు భూములు, ఇతర సమస్యలపై కాంగ్రెస్ చేసే పోరాటానికి మద్దతు తెలుపుతామన్నామని ప్రతిపక్షాల నేతలు ప్రకటించారు. మాతో కలిసి వచ్చే పార్టీ లే కాదు. ఆ పార్టీ ల అనుబంధ సంఘాలను కలుపుకుపోతామని తెలిపారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు పోడు భూముల సమస్యపై పోరాటం ఉదృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు. నిరుద్యోగుల సమస్యల పై కాంగ్రెస్ తో కలసి పోరాటం చేస్తామని ప్రకటించారు. ఉద్యోగాలు కల్పించడం లో, నిరుద్యోగ బృతి ఇవ్వడం లో కేసీఆర్ విఫలం అయ్యారని ఆరోపించారు.. ఢిల్లీ లో ప్రతిపక్షాలు కలసి పనిచేసినట్లు గానే రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు కలసి పనిచేయాలని సూచించారు.
ఇక కాంగ్రెస్ కు హుజూరాబాద్ లో మద్దతుపై కూడా సీపీఐ సానుకూలంగా స్పందించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు తెలిపే అంశంపై మా పార్టీ లో చర్చించి , మరోసారి సమావేశం అవుతామని సీపీఐ కార్యదర్శి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు.