Homeజాతీయ వార్తలుCongress And Communists: కాంగ్రెస్ తో ఉభయ కమ్యూనిస్టుల కొత్త కాపురం ఫలిస్తుందా ?

Congress And Communists: కాంగ్రెస్ తో ఉభయ కమ్యూనిస్టుల కొత్త కాపురం ఫలిస్తుందా ?

Congress And Communists: సూది, దబ్బుణం అంటూ విమర్శించిన కేసీఆర్ తోనే పిలుపునందుకున్నాయి. స్నేహ హస్తాన్ని అందించి మునుగోడు ఉప ఎన్నికలో గెలిపించాయి. ఆ తర్వాత ఆ కాపురం చక్కబడలేదు. సీట్ల పంపకం వరకి వచ్చేసరికి చిక్కబడలేదు. కలహాల కాపురం పెద్దగా ముందుకు పోదు కాబట్టి విడాకులు అయ్యాయి. కెసిఆర్ ఏమో మీరు ఇండియా కూటమిలో చేరారు కాబట్టి కుదరదు అని చెప్పేశాడు. మేము కోరుకున్న సీట్లు ఇవ్వలేదు కాబట్టి మాకు వద్దని కమ్యూనిస్టులు చెప్పేశారు. మొత్తానికి కటీఫ్ చెప్పుకున్నారు. ఇప్పుడు ఏమి చేయవలె అని ఆలోచిస్తున్నప్పుడు కొత్త సంసారానికి కాంగ్రెస్ తో కమ్యూనిస్టులు పొత్తు కుదుర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మధ్యవర్తితో సిపిఐ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తమకు బలమున్నచోట సీట్ల సర్దుబాటుపై స్పష్టత ఇవ్వాలని పట్టుపడుతోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో సిపిఎం, సిపిఐ నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

మారుతున్న పరిణామాలు

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.. రాష్ట్రంలో కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఉభయ కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకత్వాల చొరవతో ఎన్నికల పొత్తుకు సానుకూల వాతావరణం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల పొత్తుకు సంబంధించి సిపిఐ నేతల అభిప్రాయం తీసుకునేందుకు ఒక మధ్యవర్తి ఆదివారం ఆ పార్టీ నేతలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అత్యంత రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల పొత్తు ప్రతిపాదన పై కొంత సానుకూలత వ్యక్తం చేసిన వారు.. సీట్ల సర్దుబాట్ల విషయంలో సాగదీత ధోరణి వద్దని స్పష్టం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ నిర్దిష్ట ప్రణాళికతో రావాలని, పార్టీ లేదా రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు విషయం తేలిపోవాలని వారు చెప్పినట్టు తెలుస్తోంది. తుది నిర్ణయం ఏమైనప్పటికీ సిపిఎం రాష్ట్ర నాయకత్వాన్ని కూడా సంప్రదించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

సిపిఎం సైతం..

సిపిఎం సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి నిర్దిష్ట ప్రతిపాదన వచ్చినప్పుడే సీట్ల సర్దుబాట్లపై చర్చలు ప్రారంభించాలని భావిస్తోంది. ఇతర పార్టీలు కలిసి వచ్చినా.. రాకున్నా.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. జాబితాగా చెరో ఐదు సీట్లతో ప్రతిపాదన ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ తో పొత్తు ప్రతిపాదన తెరపైకి రావడంతో ఒకటి రెండు రోజుల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకత్వాలు సమావేశం అవుతాయని.. ఆ భేటీ తర్వాతే దీనిపై మరింత స్పష్టత వస్తుందని సమాచారం.

కెసిఆర్ తీరు వల్లే

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల సర్దుబాటుకు సిపిఎం చాలా సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నది. సిపిఐ మాత్రం 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసే పోటీ చేసినప్పటికీ సీట్ల సర్దుబాట్లలో సాగదీత వల్ల ఆ పొత్తులు సానుకూల ఫలితాలు ఇవ్వలేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాల ఓట్లు కీలకంగా మారడంతో ముఖ్యమంత్రి ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతు సంపాదించారు. రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మనుగడకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కీలకంగా మారడంతో వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితితో సీట్ల సర్దుబాట్ల కోసం ఆ పార్టీల నాయకత్వాలు చివరి వరకు చాలా ఓపికగా ఎదురు చూశాయి. అయితే తాము కోరిన స్థానాల్లో సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాయి. వాస్తవానికి ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్న వామపక్షాలు.. రాష్ట్రంలో మాత్రం భారత రాష్ట్ర సమితితో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి. అయితే ముఖ్యమంత్రికి ఏకపక్ష నిర్ణయంతో ఉభయ వామపక్ష పార్టీలు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.

సర్దుబాటు ఎలా?

ఉభయ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ పొత్తుపై ఒక అవగాహనకు రావాలంటే సీట్ల సర్దుబాటు ఒక సవాల్ గా మారే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ తో పొత్తు చర్చలు జరిగే ముందు.. మునుగోడు, వైరా, కొత్తగూడెం, బెల్లంపల్లి, హుస్నాబాద్ స్థానాలను సిపిఐ.. భద్రాచలం, పాలేరు, మధిర, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం స్థానాలను సిపిఎం అడిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ముందూ ఇవే సీట్ల విషయాలను రెండు పార్టీలూ ప్రతిపాదిస్తే.. సర్దుబాట్ల దగ్గరే చిక్కుముడి పడే అవకాశం ఉంది. ఎందుకంటే సిపిఐ అడుగుతున్న సీట్లలో మునుగోడు, కొత్తగూడెం స్థానాల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిపిఎం అడుగుతున్న స్థానాల్లో భద్రాచలం, మధిర ప్రస్తుతం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు. 2018లో పాలేరు స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఎలా సాధ్యం అవుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular