Homeజాతీయ వార్తలుTelangana Congress: కాంగ్రెస్ దూకుడు: తొలి జాబితాలోనే మెజార్టీ సీట్ల కేటాయింపు

Telangana Congress: కాంగ్రెస్ దూకుడు: తొలి జాబితాలోనే మెజార్టీ సీట్ల కేటాయింపు

Telangana Congress: వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను తొలి జాబితాలోనే మెజారిటీ సీట్లకు ఖరారు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ జాబితాలోనే సగానికి పైగా బీసీ కోటా, రిజర్వ్‌డ్‌ స్థానాల అభ్యర్థులనూ ఖరారు చేసే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ స్ర్కీనింగ్‌ కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సమావేశమైన స్ర్కీనింగ్‌ కమిటీ ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వానికి వచ్చిన దరఖాస్తులను ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(పీఈసీ) సభ్యులు ప్రాథమికంగా వడపోయడం, వాటిపై పీఈసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నాయకులతోనూ స్ర్కీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ ముఖాముఖి సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యలో కమిటీ సభ్యులు సిద్దిఖి, జిగ్నేశ్‌ మేవాని, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాణిక్‌రావ్‌ ఠాక్రేలతో మురళీధరన్‌ సమావేశమై వడపోత అనంతరం నియోజకవర్గాల వారీగా మిగిలిన ఆశావహుల వివరాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికలో పాటించాల్సిన ప్రామాణికాలపైనే చర్చించారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో బీసీలకు 34 సీట్లు కేటాయించాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఏయే నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం బలంగా ఉంది? ఏ నియోజకవర్గంలో ఏ బీసీ సామాజిక వర్గ నేతను ఎంపిక చేస్తే బాగుంటుందన్నదానిపై ప్రాథమికంగా చర్చించారు.

మహిళలకూ కోటా..

మహిళలకు కోటా, ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో మాదిగ, మాల సామాజికవర్గాలకు, ఉప కులాలకు, ఎస్టీ రిజర్వ్‌డ్‌లో ఆదివాసీలు, లంబాడా గిరిజనులకు కేటాయించాల్సిన సీట్ల నిష్పత్తిపైనా సమీక్షించినట్లు తెలుస్తోంది. మరోమారు సమావేశమై సర్వే నివేదికలు, ప్రామాణికాలు తదితర అంశాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలనుకున్నారు. అయితే తదుపరి సమావేశం ఎప్పుడన్న దానిపై ఇంకా నిర్ణయం జరగలేదు. ఈ నెల 16, 17వ తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు, 17న సోనియాగాంధీ సభ, 18న పార్టీ ముఖ్య నాయకులు నియోజకవర్గాలకు వెళ్లే కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈ లోపు తదుపరి సమావేశం ఉండకపోవచ్చునని చెబుతున్నారు. తొలి జాబితా 17న సోనియా సభ తర్వాతే విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

10 నుంచి 15 మంది హస్తం గూటికి..

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ పార్టీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. బీఆర్‌ఎస్ లోని అసంతృప్తుల నుంచి మొదలుకుని ఇతర పార్టీల్లోని సీనియర్లు, మాజీ మంత్రులతో పాటు పాతనేతలను మళ్లీ పార్టీలోకి చేర్చుకునేందుకు వ్యూహం రచిస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుతో హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి భేటీ కాగా, ఖమ్మంలో పొంగులేటి, భట్టి కూడా తమ్మలను కలిసి.. కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. బీజేపీలో సస్పెన్షన్‌కు గురైన యెన్నం శ్రీనివాసరెడ్డితోనూ కాంగ్రెస్‌ నేతలు టచ్‌లోకి వెళ్లారు. మిగతా జిల్లాల్లోని మరికొంతమంది సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులను కూడా పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు వీరందరి చేరికకు సెప్టెంబరులోనే ముహుర్తాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం కాంగ్రెస్‌ అగ్రనేతలంతా హైదరాబాద్‌కు వస్తుండడంతో వారి సమక్షంలోనే 17న నిర్వహించబోయే బహిరంగ సభ వేదిక ద్వారా ఆయా నేతలందరినీ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు 10 నుంచి 15 మంది కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular