
Komati Reddy Venkat Reddy- Revanth Reddy: ఎదిగే నేతను కిందకు తోసేయడం కాంగ్రెస్ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అంతర్గత స్వాతంత్య్రం పేరుతో స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టే అసలైన కాంగ్రెస్ వాదులు ఉన్నారు ఆ పార్టీలు. తన రక్తమంతా కాంగ్రెస్సే అని.. చివరి వరకు పార్టీలోనే ఉంటామని, తాను చచ్చాక తన పార్థీవ దేహంపై కాంగ్రెస్ జెండా కప్పాలని కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిలా మాట్లాడతారు. కానీ ఎవరైనా ఎదిగినా, ఎవరిచేత అయినా పార్టీ బలపడినా ఓర్వలేరు. అవసరమైతే కూటములు కట్టి మరి ఎదిగే నేతలు కిందకు లాగుతారు. తాజాగా ఇలాంటి రాజకీయమే కాంగ్రెస్‌లో మొదలైంది. తనకు పీసీసీ అధ్యక్ష పదవి రాలేదన్న కోసం ఒకవైపు, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి ఆ పదవి ఇచ్చారన్న అక్కసు ఇంకోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఇబ్బంది పెట్టాయి. దీంతో రాజగోపాల్‌రెడ్డి పార్టీ నుంచి జంప్ అయ్యాడు. ఇక వెంకట్‌రెడ్డి పార్టీలోనే ఉంటూ రేవంత్‌ను ఫెల్యూర్ లీడర్‌గా చూసేందుకు తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
పార్టీ కోసంచమటోడుస్తున్న రేవంత్..
తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావాలని, అధికార బీఆర్‌ఎస్ పార్టీతో తలపడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శత విధాలా ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, కుటుంబ పాలనను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రగతి భవన్‌ను కూల్చేద్దాం అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన, తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించకపోతే ఏం జరుగుతుంది వంటి అంశాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు.
ఒక్క డైలాగ్‌తో సర్వనాశనం..
హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచాలని, ప్రజల్లోకి హస్తం గుర్తును బలంగా తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కోమటిరెడ్డికి కన్నుకుట్టింది. తనకు పదవి రాలేదుని, తనను కోవర్ట్‌రెడ్డి అన్నారని అక్కసు పెంచుకున్న ఆయన అదును చూసి దెబ్బకొట్టారు. ఒక్క డైలాగ్‌తో రేవంత్ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. ఒకపక్కన ఇప్పటికే మనుగడ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని, మళ్లీ బతికించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే.. ఆయన మాటలతో కాంగ్రెస్ పార్టీ లేవకుండా చావు దెబ్బ కొట్టాడు. టీపీసీసీ అధ్యక్షుడికి బాసటగా రాకపోగా, ఆయన ఏ ప్రయత్నం చేసినా ఒకే ఒక్క మాటతో దాన్ని ఫెయిల్ చేస్తున్నారు.

టార్గెట్ రేవంత్‌రెడ్డి..
భవిష్యత్తులో బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన జోస్యం చెప్పారు .ఏ పార్టీ కూడా 60 సీట్లను గెలవలేదని హంగ్ తప్పదు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీని ఒక్కరే గెలిపించడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో పార్టీ గాడిలో పడుతుందని, కొత్త వారైనా పాతవారైనా గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రేవంత్ రెండడుగులు ముందుకు వేస్తే, ఒక్కసారిగా ఆయనను వంద అడుగుల వెనక్కు లాగేశాయి. ఇదెక్కడి పంచాయితీ రా అని క్యాడర్ తల పట్టుకుంటోంది.
రేవంత్‌ను వదలడా ?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నట్టుగా పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ నాయకులు కలిసి వచ్చినా, కలిసి రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలతో కలిసి ముందుకు సాగాలని, ప్రజాదరణ సాధించాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తుంటే, ఇక ఆ ప్రయత్నాన్ని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నాయకులు విఫలమయ్యేలా చేయడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. రేవంత్‌పై కోమటిరెడ్డి ప్రతీకారం తీసుకుంటున్నారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రేవంత్‌ను ఫెల్యూర్ లీడర్ అని నిరూపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.