Governor Vs KCR: దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై ఏడాదిగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ సెగ తెలంగాణ గవర్నమెంట్‌కూ తగిలింది. గణతంత్ర వేడుల సందర్భంగా కేసీఆర్ సర్కార్ తీరును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టడం, వేడుకల నిర్వహణపై ఆదేశాలు ఇవ్వడం, వేడుకల సాక్షిగా గవర్నర్ కేసీఆర్‌పై విమర్శలు చేయడం తెలిసిందే. తనదాకా వస్తే కాని నొప్పి తెలియదు అన్నట్లు.. దేశంలో గవర్నర్ల తీరుతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పార్లమెంట్ వేదికగా పోరాటం చేయాలని బీఆర్‌ఎస్ అధినేత నిర్ణయించారు. ఈమేరకు పార్టీ ఎంపీలకు సూచించారు.

గవర్నర్ బాధిత ముఖ్యమంత్రులతో మంతనాలు..
తెలంగాణతోపాటు కేరళ, తమిళనాడు, కేరళ, ఢిల్లీ మొదలైన చోట్ల గవర్నర్లు సొంత ఎజెండాతో పని చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యాన్ని నిరోధించడంపై దేశంలోని విపక్ష పార్టీల నేతలతో కలిసి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దుర్మార్గమైన తీరును దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల అధికార, విపక్ష పార్టీలను కూడా కలుపుకుపోవాలని కేసీఆర్ ఎంపీలకు సూచించారు. ఈమేరకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన విపక్ష నేతలతో కేసీఆర్ స్వయంగా మాట్లాడారు. ఢిల్లీ, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, స్టాలిన్, విజయన్‌తోపాటు విపక్ష నేతలు అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరులతో ఇప్పటికే కేసీఆర గవర్నర్ల తీరుపై చర్చించారు. పార్లమెంటు జరిగినన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంతోపాటు దేశంలోని ప్రజా సమస్యలపై గళం వినిపించాలని తెలిపారు.
గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని, గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని పార్లమెంట్ వేదికగా నిలదీయాలని కేసీఆర్ ఎంపీలకు సూచించారు. రాష్ట్రాలను నిర్వీర్యపరిచే దిశగా గవర్నర్లను కేంద్రం తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడం, రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తిస్తూ కేంద్రం, రాష్ట్రాల నడుమ సంధానకర్తలుగా ఉండాల్సిన గవర్నర్ల వ్యవస్థను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న దుర్మార్గ విధానాలను ఉభయ సభల్లో వ్యతిరేకించాలని తెలిపారు.

కేసీఆర్ నిర్ణయంతో తమిళనాడు, ఢిల్లీ, కేరళ సీఎంలతోపాటు విపక్ష నేత అఖిలేశ్‌యాదవ్, తేజస్వి యాదవ్ ఏకీభవించారా లేదా అనేది విషయంలో స్పష్టత లేదు. మంగళవారం ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశంలో అనుసరించే వ్యూహం ద్వారా వారు బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తారా లేదా అన్నది బయట పడుతుంది.