Rahul Gandhi Jodo Yatra: దేశంలో నానాటికీ పతనమవుతూ ఒక్కో రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీలో జోష్ తెచ్చేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిన 4 వేల కిలోమీటర్ల యాత్ర ద్వారా పార్టీ పెద్దగా పుంజుకున్నట్లు కనిపించడం లేదు. గతేడాది సెప్టెంబర్ 7న ప్రారంభించిన యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, 74 జిల్లాల మీదుగా యాత్ర సాగింది. ఈ ఏడాది జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు కాంగ్రెస్‌కు కాస్త ఊరట కలిగించాయి. ఇక కాంగ్రెస్ బలం కూడా స్వల్పంగానే పెరిగింది. ఇండయా టుడే ఇటీవల నిర్వహించిన మూడ్ ఆఫ్‌ది నేషన్ సర్వేలో కాంగ్రెస్ బలం 2019తో పోలిస్తే 44 సీట్ల నుంచి 68 సీట్లకు మాత్రమే పెరిగింది. అయితే ఇదే సమయంలో యూపీఏ బలం మాత్రం పుంజుకుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ 191 సీట్లు సాధిస్తుందని వెల్లడయింది.

రాహుల్ సరికొత్తగా..
భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ మాత్రం తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు. తనతోపాటు, కాంగ్రెస్ పార్టీపై ఉన్న అంచనాలను పటాపంచలు చేయగలిగారు. రాహుల్ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని, ఆయన తల్లి సోనియా గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిన తీరు సాధారణ జనానికి కూడా నచ్చలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతల్ని దాటుకుంటూ తమ వరకూ చేరుకున్న ఈడీని నిలువరించేందుకు గాంధీ కుటుంబం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని జనం వద్దే తేల్చుకోవాలని నిర్ణయించిన రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడోయాత్రకు సిద్ధమయ్యారు. అనుకున్నట్లే 134 రోజుల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ యాత్రను విజయవంతంగా పూర్తి చేసేశారు. ఈ యాత్రకు ముందు రాహుల్‌ను విమర్శించిన వారు ఇప్పుడు అవే విమర్శలు చేసేందుకు వెనుకాడడం రాహుల్ తన యాత్రద్వారా సాధించిన విజయంగా చెప్పవచ్చు.
యాత్ర సక్సెస్.. మరి పార్టీ..?
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాల్లో ఓ సుదీర్ఘమైన పాదయాత్రే కాదు, అంతకు మించి దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను ఏకం చేసిన యాత్ర. ఇందులో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్నో విపక్ష పార్టీల నేతలు, సీఎంలు, మాజీ సీఎంలు, ఎంపీలు, సామాజిక కార్యకర్తలు ఇలా చాలా మంది మద్దతు తెలిపారు. అంతకు మించి రాహుల్ గాంధీపై ఉన్న భ్రమల్ని తొలగించేందుకు ఈ యాత్ర దోహదపడింది. గతంలో రాహుల్ అంటే ఓ పార్ట్ టైమ్ పొలిటీషియన్, పప్పు అని విమర్శించిన వారికి ఈ యాత్రతో కాంగ్రెస్ రాకుమారుడు తానేంటో గుర్తుచేశాడు. అంతే కాదు భవిష్యత్తులో దేశ ప్రధాని కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని నిరూపించుకున్నారు. వ్యక్తిగత అలవాట్ల దగ్గరి నుంచి దేశ భవిష్యత్తు వరకూ రాహుల్ ఈ యాత్రలో అన్నీ ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు. దీంతో రఘురామ్ రాజన్ వంటి ఆర్ధిక మేధావి, తమిళనాడులో యాత్ర సాగినంతసేపు కలవని కమల్ హాసన్ వంటి వారు కూడా రాహుల్‌కు సంఘీభావం ప్రకటించారు. ఈ యాత్ర వ్యక్తిగతంగా రాహుల్ ఇమేజ్‌ను భారీగా పెంచింది. కచ్చితంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెంచుతుందని అంతా ఊహించారు. కానీ ఇప్పుడు వారి అంచనాల్ని సైతం తలకిందులు చేస్తూ ప్రస్తుతం ఉన్న 44 సీట్ల నుంచి 68 సీట్లకు మాత్రమే బలం పెరగింది. ఇండియా టుడే తాజాగా వెలువరించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే అంచనావేసింది.
బీజేపీ వ్యతిరేక సీట్లలో పెరుగుదల
కాంగ్రెస్ 68 సీట్లకు పరిమితం అవుతుందని, ఇతరులతో కలిపి విపక్షాలకు 191 సీట్లు వస్తాయని సర్వే సంస్థ వెల్లడించింది. ఇక కాంగ్రెస్ సారథి ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు రాహుల్ గాంధీకి 26 శాతం మంది ఓటేశారు. 17 శాతం సచిన్ పైలెట్‌వైపు మొగ్గు చూపారు.
ప్రతిపక్ష నేతగా కేజ్రీవాల్‌కు మద్దతు..
ఇక దేశంలో ప్రతిపక్ష నేత ఎవరైతే బాగుంటుందని సర్వే సంస్థ అడిగిన ప్రశ్నకు చాలామంది కాంగ్రెస్‌ను పక్కన పెట్టారు. ప్రతిపక్ష నేతగా కేజ్రీవాల్‌కి 24 శాతం మంది మద్దతు తెలిపారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి 20 శాతం మంది ఓటు వేశారు. మోదీకి ధీటైన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి కేవలం 13 శాతం మద్దతు లభించినట్లు సర్వేలో వెల్లడైంది.

త్వరలో పార్ట్–2 యాత్ర..
కన్యాకుమారిలో మొదలుపెట్టిన కశ్మీర్ వరకూ ఏకధాటిగా 134 రోజుల పాటు భారత్ జోడో యాత్ర పార్ట్ 1 నిర్వహించిన రాహుల్ గాంధీ.. త్వరలో పార్ట్ 2 మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నారు. దేశంలో దక్షిణ కొన నుంచి ఉత్తర కొన వరకూ పార్ట్ 1 చేపట్టిన రాహుల్.. ఇప్పుడు తూర్పు కొన అయిన అరుణాచల్ ప్రదేశ్ నుంచి పశ్చిమ కొన అయిన మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ వరకూ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్, ఇతర అంశాలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలలోపు దీన్ని కూడా పూర్తి చేసి సగర్వంగా ఎన్నికలకు వెళ్లాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. పార్ట్–2తో అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్థాయికి బలపడుతుందో లేదో చూడాలి.