
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి లాక్ డౌన్ దిశగా సాగుతున్నారని సంకేతాలు వెలువడుతున్నాయి. కరోనా మొదటి వేవ్ ను లాక్ డౌన్ తో కంట్రోల్ చేసిన మోడీ సెకండ్ వేవ్ ను మాత్రం కట్టడి చేయలేక అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.ప్రజలు ఏమాత్రం కోవిడ్ నిబంధనల విషయంలో సీరియస్ గా లేకపోవడంతో కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే లాక్ డౌన్ పెడితే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయన్న భయం కేంద్రాన్ని, రాష్ట్రాలను వెంటాడుతున్నాయి. అందుకే రాత్రి కర్ఫ్యూ, ఆంక్షలు విధిస్తున్నాయి.కానీ వాటివల్ల కేసులు తగ్గడం లేదు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతోంది. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలు లాక్ డౌన్ పెట్టేశాయి. ఈ క్రమంలోనే కేంద్రమే కఠిన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కేంద్రం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మే 2వ తేదీ తర్వాతనే దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం వెల్లడించే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మే 2న ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత సంపూర్ణ లాక్ డౌన్ పై ప్రకటన చేస్తారని అంటున్నారు.
అయితే వలస కార్మికులు ఇతరులు సొంత ఊళ్లకు వెళ్లిపోయేలా వెసులుబాలు ఇస్తారని.. ఆ తర్వాత దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారని అంటున్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రతిరోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. శవాలు క్యూలు ఉన్న దుర్భరమైన చిత్రాలు వెలుగుచూస్తున్నాయి. కేంద్రప్రభుత్వం విఫలమైందని అంతర్జాతీయంగా ఆరోపణలు వస్తున్నాయి. కఠిన నిర్ణయాలు తీసుకోవడం లేదని మోడీని అందరూ కార్నర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మే 2న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాక కేంద్రం దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తుందని సమాచారం. ఈ మేరకు మోడీ సర్కార్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. సో సొంతూళ్లకు వెళ్లేవారందరూ ఇప్పటి నుంచే తయారవుతున్నట్టు తెలుస్తోంది. పోయిన సారి వలసకార్మికుల వెతలు చూశాక ఈసారి అందరూ ముందే సర్ధుకుంటున్న పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తోంది.